Mithali Raj Retirement: అజేయ సెంచరీతో మొదలై హాఫ్‌ సెంచరీతో ముగిసింది!

9 Jun, 2022 07:27 IST|Sakshi

మిథాలీ రాజసం ముగిసె...

కెరీర్‌ గ్రాఫ్‌ హైలైట్స్‌

Mithali Raj Retirement: రెండు దశాబ్దాలకుపైగా అలసటన్నది లేకుండా ఆడుతూ... లెక్కలేనన్ని కీర్తి శిఖరాలు అధిరోహిస్తూ... ‘ఆమె’ ఆటను అందలాన్ని ఎక్కిస్తూ... భావితరాలకు బాటలు వేస్తూ... ఇక బ్యాట్‌తో సాధించాల్సిందీ ఏమీ లేదని భావిస్తూ... భారత మహిళల క్రికెట్‌ మణిహారం మిథాలీ రాజ్‌ ఆటకు అల్విదా చెప్పింది. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన మిథాలీ అత్యున్నత దశలో ఆట నుంచి వీడ్కోలు తీసుకుంది.

న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్‌ వన్డే, టెస్టు జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించింది. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం ఈ మేరకు ఆమె ట్విటర్‌లో లేఖ విడుదల చేసింది. ఇన్నేళ్లు భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం గర్వంగా ఉందని పేర్కొన్న మిథాలీ... రెండు దశాబ్దాలకుపైగా సాగిన తన క్రికెట్‌ ప్రస్థానానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని... ప్రస్తుతం భారత మహిళల క్రికెట్‌ను ప్రతిభావంతులైన క్రీడాకారిణుల చేతుల్లో పెడుతున్నానని పేర్కొంది.

ఇన్నేళ్లపాటు అనుక్షణం తన వెన్నంటే ఉండి ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని 39 ఏళ్ల ఈ హైదరాబాద్‌ క్రికెటర్‌ తెలిపింది. 1999 జూన్‌ 26న ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో అజేయ సెంచరీ (114 నాటౌట్‌)తో అద్భుత అరంగేట్రం చేసిన మిథాలీ... 2022 మార్చి 27న దక్షిణాఫ్రికాతో చివరి వన్డే (68 పరుగులు) ఆడింది. 23 ఏళ్ల ఆమె అంతర్జాతీయ కెరీర్‌ సెంచరీతో మొదలై అర్ధ సెంచరీతో ముగియడం విశేషం.

భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్న లక్ష్యంతో నా ప్రస్థానం మొదలైంది. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ప్రతి ఒక సంఘటనతో కొత్త విషయాలు నేర్చుకున్నాను. గత 23 ఏళ్లలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. అన్ని ప్రయాణాల మాదిరిగానే నా క్రికెట్‌ కెరీర్‌కు ముగింపు వచ్చింది. అందుకే అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వీడ్కోలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను.

మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారీ నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి భారత్‌ను విజేతగా నిలబెట్టాలని కృషి చేశా.  ప్రస్తుతం భారత మహిళల క్రికెట్‌ భవిష్యత్‌ ఉజ్వలంగా ఉందని... యువ క్రికెటర్ల చేతుల్లో సురక్షితంగా ఉందని భావిస్తూ నా కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నా. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా ఎల్లవేళలా నాకు మద్దతు ఇచ్చిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి, బోర్డు కార్యదర్శి జై షాకు ధన్యవాదాలు చెబుతున్నా.

ఏళ్లపాటు భారత జట్టుకు కెప్టెన్‌గా ఉండటం గర్వకారణంగా ఉంది. నాయకత్వ బాధ్యతలు నన్ను వ్యక్తిగానే కాకుండా భారత క్రికెట్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు దోహదపడ్డాయి. ప్లేయర్‌గా నా ప్రయాణం ముగిసినా... భవిష్యత్‌లో మహిళల క్రికెట్‌ ఉన్నతికి నా వంతుగా కృషి చేస్తా. ఇన్నాళ్లు నా వెన్నంటే నిలిచి ప్రేమ, ఆప్యాయతలు పంచిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా.     –మిథాలీ రాజ్‌

మిథాలీ కెరీర్‌ గ్రాఫ్‌...
ఆడిన వన్డేలు 232
చేసిన పరుగులు: 7,805, నాటౌట్‌: 57 
అత్యధిక స్కోరు: 125 నాటౌట్‌ 
సగటు: 50.68 
సెంచరీలు: 7, అర్ధ సెంచరీలు: 64 
క్యాచ్‌లు: 64, తీసిన వికెట్లు: 8

ఆడిన టెస్టులు 12
చేసిన పరుగులు: 699, నాటౌట్‌: 3 
అత్యధిక స్కోరు: 214, సగటు: 43.68 
సెంచరీలు: 1, అర్ధ సెంచరీలు: 4, క్యాచ్‌లు: 12

ఆడిన టి20లు 89
చేసిన పరుగులు: 2,364 
అత్యధిక స్కోరు: 97 నాటౌట్‌ 
సగటు: 37.52 
సెంచరీలు: 0
అర్ధ సెంచరీలు: 17, క్యాచ్‌లు: 19 

చదవండి: Mithali Raj: మిథాలీరాజ్‌ పెళ్లి చేసుకోకపోవడం వెనుక కారణం?

మరిన్ని వార్తలు