Ian Chappell: అలా చేయకపోయుంటే కోహ్లి హవాలో రోహిత్‌ తెరమరుగయ్యేవాడు..!

14 Feb, 2023 15:24 IST|Sakshi

Rohit Sharma-Virat Kohli: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గురించి ఆస్ట్రేలియా మాజీ సారధి ఇయాన్‌ ఛాపెల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మిడ్‌ డే కాలమ్‌కు రాసిన ఓ ఆర్టికల్‌లో ఛాపెల్‌ రోహిత్‌ శర్మతో పాటు టీమిండియా మాజీ సారధి, రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లి పేరునూ ప్రస్తావిస్తూ.. రోహిత్‌ శర్మను టెస్ట్‌ల్లో ఓపెనింగ్‌ స్థానంలో పంపడం వల్ల టీమిండియా మేనేజ్‌మెంట్‌ అతని కెరీర్‌ను కాపాడిందని, కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టడం హిట్‌మ్యాన్‌ కెరీర్‌లో నిలదొక్కుకోవడానికి దోహదపడిందని బోల్డ్‌ కామెంట్స్‌ చేశాడు.

రోహిత్‌ మిడిలార్డర్‌ బ్యాటింగ్‌ దిగి తన అపార నైపుణ్యాన్ని వృధా చేసుకుంటున్నాడని ఓ దశలో అనిపించిందని, అప్పుడే రోహిత్‌ టెస్ట్‌ కెరీర్‌కు ఎండ్‌ కార్డ్‌ పడుతుందని భావించానని ఛాపెల్‌ తన కథనంలో పేర్కొన్నాడు. ఓపెనర్‌గా ప్రమోషన్‌ పొందే విషయంలో రోహిత్‌ టీమిండియా మేనేజ్‌మెంట్‌ను ఒప్పించడంలో సఫలం అయ్యాడని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న హిట్‌మ్యాన్‌ ఓపెనర్‌గా స్థిరపడ్డాడని అన్నాడు.

ఇలా జరుగకపోయి, మిడిలార్డర్‌లో, అదీ కోహ్లి తర్వాత బరిలోకి దిగుతూ వచ్చి ఉంటే.. రోహిత్‌ ఎప్పుడో కోహ్లి హవాలో కొట్టుకుపోయి ఉండేవాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో రోహిత్‌ బ్యాటింగ్‌ తీరు చాలా మెరుగుపడిందని, ఓ రకంగా చెప్పాలంటే కెప్టెన్సీ రోహిత్‌ కెరీర్‌ను కాపాడిందని అన్నాడు. 

ఇదే కాలమ్‌లో ఛాపెల్‌.. రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ను ఆకాశానికెత్తాడు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంలో రోహత్‌ పెద్దన్న పాత్ర పోషించాడని, ఉపఖండపు పిచ్‌లపై ఎలా బ్యాటింగ్‌ చేయాలో రోహిత్‌ ఇరు జట్ల ఆటగాళ్లకు బోధపడేలా చేశాడని తెలిపాడు.

తొలి టెస్ట్‌లో రోహిత్‌ మాస్టర్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌ ఆడాడని, మెలికలు తిరిగే పిచ్‌పై రోహిత్‌ సెంచరీ చేయడం అద్వితీయమని కొనియాడాడు. రోహిత్‌ కాన్ఫిడెంట్‌గా బ్యాటింగ్‌ చేస్తుండటం చూసి ఆసీస్‌ బౌలర్లు విసిగిపోయారని, ఇదీ రోహిత్‌ కెపాసిటీ అని ప్రశంసలు కురిపించాడు. 

మరిన్ని వార్తలు