Vinod Kambli: భార్యకు చిత్రహింసలు.. మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

5 Feb, 2023 11:47 IST|Sakshi

నిత్యం వివాదాల్లో నిలిచే టీమిండియా మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. భార్యను చిత్రహింసలకు గురిచేస్తూ ఆమెపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కాంబ్లీని అరెస్ట్‌ చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కాంబ్లీ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకే తాము కాంబ్లీని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

విషయంలోకి వెళితే.. ప్రస్తుతం వినోద్‌ కాంబ్లీ తన భార్య ఆండ్రియా, కుమారుడితో కలిసి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో నివసిస్తున్నాడు. శుక్రవారం ఇంట్లోనే మద్యం తాగిన మత్తులో భార్య ఆండ్రియాతో గొడవపడ్డాడు. ఆ తర్వాత మద్యం మత్తులో పాన్‌ హ్యాండిల్‌తో తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లు ఆండ్రియా తెలిపింది. ఈ క్రమంలో తలకు బలమైన గాయం అయిందని ఆరోపించింది. ఆండ్రియా ఇచ్చిన సమాచారం మేరకు నివాసానికి చేరుకున్న పోలీసులు వినోద్‌ కాంబ్లీని అదుపులోకి తీసుకొని అతని భార్య ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 324, సెక్షన్ 504 కింద కేసు నమోదు చేశారు

అయితే 51 ఏళ్ల కాంబ్లీకి వివాదాలు కొత్తేం కావు. గతేడాది ఫిబ్రవరిలో తను నివాసముండే హౌసింగ్ సొసైటీలో గొడవ కారణంగా ముంబై పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలం క్రితం కాంబ్లీ మద్యం తాగి వాహనం నడిపి కారును ఢీకొట్టడంతో మారోసారి వార్తల్లో నిలిచాడు.  అయితే ఇటీవలి కాలంలో ఆయన ఒక స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాధను వ్యక్తం చేశాడు.

తనకు సంపాదన లేదని, కేవలం బీసీసీఐ ఇస్తున్న పెన్షన్ పైనే ఆధారపడి జీవించాల్సి వస్తుందని తెలిపాడు. 1991లో టీమిండియాలోకి  ఎంట్రీ ఇచ్చిన వినోద్‌ కాంబ్లీ సచిన్‌ టెండూల్కర్‌కు మంచి సన్నిహితుడు. అయితే అతని వ్యక్తిగత ప్రవర్తనతో జట్టులో చోటు కోల్పోయాడు. టీమిండియా తరపున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు.

చదవండి: 'తెల్లబంతి పని పట్టా.. ఎరుపు బంతి కోసం వెయిటింగ్‌'

'ప్రైవసీకి భంగం'.. ఫోటోలు లీకవడంపై ఆగ్రహం

మరిన్ని వార్తలు