ఎలా గెలిచిందో.. అలానే ఓడింది!

13 Sep, 2020 08:51 IST|Sakshi

యూఎస్‌ ఓపెన్‌ ఒసాకాదే

ఏడాది గ్యాప్‌లో రెండో యూఎస్‌ టైటిల్‌

పోరాడి ఓడిన అజరెంకా

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేతగా జపాన్‌ క్రీడాకారిణి, నాల్గో సీడ్‌ నయామి ఒసాకా నిలిచింది. భారత కాలమానం ప్రకారం ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఫైనల్లో ఒసాకా 1-6, 6-3, 6-3 తేడాతో అజరెంకాపై గెలిచి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. తొలి సెట్‌ను ఒసాకా కోల్పోయినప్పటికీ మిగతా రెండు సెట్లలో ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా బరిలో నిలిచి టైటిల్‌ను సాధించింది. ఇది ఒసాకాకు రెండో యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌. 2018లో యూఎస్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఒసాకా.. ఏడాది గ్యాప్‌లోమరోసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నీని సొంతం చేసుకుంది. ఆమెకు ఇది ఓవరాల్‌గా మూడో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌. గతేడాది జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌ను ఆమె గెలుచుకున్న సంగతి తెలిసిందే.(చదవండి: సూపర్‌ జ్వెరెవ్‌)

ఈ రోజు జరిగిన తుదిపోరులో ఒసాకా తొలి సెట్‌ను భారీ తేడాతో కోల్పోయింది. ఆమె 1-6 తేడాతో సెట్‌ను చేజార్చుకుంది. అయితే ఆ తర్వాత అజరెంకాకు చుక్కలు చూపించింది. ఎక్కడ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరసగా గేమ్‌లను కైవసం చేసుకుంటూ ఒసాకా ముందుకు సాగింది. ఈ క్రమంలోనే రెండో సెట్‌ను సాధించిన ఒసాకా.. అదే ఊపును నిర్ణయాత్మక మూడో సెట్‌లో కూడా ప్రదర్శించింది. ఫలితంగా ఆమె ఖాతాలో మరో యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ చేరింది. కాగా, ఈ మ్యాచ్‌లో అజరెంకా ఓడిన తీరు ఆమె ఆడిన సెమీఫైనల్‌ను గుర్తు చేసింది. సెరెనా విలియమ్స్‌తో జరిగిన సెమీస్‌లో అజరెంకా ఇలానే గెలిచి ఫైనల్‌కు చేరింది. తొలి సెట్‌ను 1-6 తేడాతో కోల్పోయిన అజరెంకా..  మిగతా రెండు సెట్లను 6-3, 6-3 తేడాతో గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది.  ఇప్పుడు అదే అనుభవం అజరెంకాకు ఎదురుకావడం గమనార్హం.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు