CWC 2023: నేను అప్పుడు కూడా నంబర్‌ వన్‌.. ప్రధాన లక్ష్యం మాత్రం అదే: సిరాజ్‌

9 Nov, 2023 18:01 IST|Sakshi

Mohammed Siraj opens up on being No. 1 ranked ODI bowler: టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ర్యాంకుల గురించి తను పట్టించుకోనని.. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ఆడటం మాత్రమే ముఖ్యమని స్పష్టం చేశాడు. కాగా ఐసీసీ వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఈ హైదరాబాదీ బౌలర్‌ అదరగొట్టిన విషయం తెలిసిందే. 

భారత్‌ వేదికగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో అద్భుత ప్రదర్శనతో మరోసారి అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. గతంలో రెండుసార్లు ‘టాప్‌’నకు చేరి ఆ తర్వాత తన స్థానాన్ని కోల్పోయిన సిరాజ్‌ ఈ ప్రపంచకప్‌లో 10 వికెట్ల ప్రదర్శనతో మళ్లీ నంబర్‌ వన్‌గా అవతరించాడు. 
 
మొత్తంగా 709 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌ ర్యాంకులో ఉన్న పాకిస్తాన్‌ పేసర్‌ షాహిన్‌ అఫ్రిదిని వెనక్కి నెట్టి.. అగ్రపీఠాన్ని అధిరోహించాడు. ఈ నేపథ్యంలో సిరాజ్‌ ఐసీసీతో మాట్లాడుతూ.. తన ప్రధాన లక్ష్యం ఏమిటో వెల్లడించాడు.

‘‘నిజం చెప్పాలంటే.. గతంలో కూడా నేను నంబర్‌ 1గా ఉన్నాను.. ఆ తర్వాత ర్యాంకింగ్స్‌ విషయంలో ఎత్తుపళ్లాలు. కాబట్టి నంబర్లను నేను ఏమాత్రం పట్టించుకోను. నా ఏకైక లక్ష్యం టీమిండియా వరల్డ్‌కప్‌ గెలవడంలో నా వంతు సహకారం అందించడమే.

బౌలర్‌గా నా ప్రదర్శన వల్ల జట్టు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు’’ అని సిరాజ్‌ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. 

కాగా సొంతగడ్డపై ప్రపంచకప్‌లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమిండియా ఇప్పటి వరకు ఆడిన ఎనిమిదింట ఎనిమిది మ్యాచ్‌లు గెలిచింది. తాజా ఎడిషన్‌లో సెమీస్‌ చేరిన తొలి జట్టుగా నిలిచిన రోహిత్‌ సేన లీగ్‌ దశలో తమ ఆఖరి మ్యాచ్‌ నెదర్లాండ్స్‌తో ఆడనుంది. బెంగళూరు వేదికగా ఆదివారం ఈ మ్యాచ్‌ జరుగనుంది.

ఇక ఐసీసీ వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో సిరాజ్‌ ప్రథమ స్థానంలో ఉండగా..  కుల్దీప్‌ యాదవ్‌ (4వ స్థానం), .జస్‌ప్రీత్‌ బుమ్రా (8వ స్థానం), మహ్మద్‌ షమీ (10వ స్థానం) టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు.

చదవండి: CWC 2023: టీమిండియాతో మ్యాచ్‌.. నెదర్లాండ్స్‌ జట్టులో కీలక మార్పు! కారణమిదే

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు