Ind Vs Pak: ‘టీమిండియాను ఓడించిన పాక్‌ లేకుండా అసలు టోర్నీ ఎవరు చూస్తారు?.. మేము ఉంటేనే అంటూ..

26 Nov, 2022 17:22 IST|Sakshi

సంచలన వ్యాఖ్యలు చేసిన రమీజ్‌ రాజా

కౌంటర్‌ ఇస్తున్న టీమిండియా ఫ్యాన్స్‌

ODI World Cup 2023- India Vs Pakistan- Ramiz Raja: ‘‘ఒకవేళ వాళ్లు ఇక్కడికి వస్తేనే మేము వరల్డ్‌కప్‌ టోర్నీ ఆడటానికి అక్కడికి వెళ్తాం. భారత జట్టు ఇక్కడికి రాకపోతే.. పాకిస్తాన్‌ లేకుండానే మెగా టోర్నీ ఆడుకోమనండి. భారత్‌లో వచ్చే ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ పాల్గొనపోతే.. ఆ ఈవెంట్‌లోని మ్యాచ్‌లను అసలు ఎవరు చూస్తారు?’’ అంటూ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ రమీజ్‌ రాజా ప్రగల్భాలు పలికాడు.

తమ జట్టు దూకుడైన ఆట తీరుకు మారుపేరుగా మారిందని.. ప్రపంచంలోని సంపన్న బోర్డుకు చెందిన జట్టును కూడా మట్టికరిపించిందంటూ గొప్పలకు పోయాడు. కాగా ఆసియా కప్‌-2023 టోర్నీ పాకిస్తాన్‌ వేదికగా నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైన విషయం తెలిసిందే.

అక్కడ ఆసియా కప్‌.. ఇక్కడ వరల్డ్‌కప్‌
అయితే, ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా.. భారత జట్టు పాక్‌కు వెళ్లే ప్రసక్తి లేదని గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన పీసీబీ తమతో చర్చించకుండా.. తమకు సమాచారం ఇవ్వకుండా ఇలా ఎలా మాట్లాడతారంటూ అభ్యంతరం తెలిపింది.

ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ స్పందిస్తూ.. భారత జట్టు పాకిస్తాన్‌లో పర్యటించాలా వద్దా అన్న అంశం ప్రభుత్వ పరిధిలోనిది అని స్పష్టం చేశారు. కేంద్రం నిర్ణయానికి అనుగుణంగానే తాము నడుచుకుంటామని పేర్కొన్నారు.

వాళ్లను ఓడించాం కదా
ఈ విషయం గురించి తాజాగా ఉర్దూ న్యూస్‌తో మాట్లాడిన పీసీబీ చీఫ్‌ రమీజ్‌ రాజా.. తమ విషయంలో బీసీసీఐ ప్రవర్తించే తీరుపైనే వరల్డ్‌కప్‌ ఆడాలా వద్దా అన్న నిర్ణయం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. ‘‘ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్‌ మార్కెట్‌కు చెందిన జట్టును మేము ఓడించాం. మా ఆట తీరు మెరుగుపరుచుకుని.. అత్యుత్తమంగా ఆడుతుంటేనే పాక్‌ క్రికెట్‌ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుందని నేను నమ్ముతాను.

అందుకు తగ్గట్లుగానే టీ20 ప్రపంచకప్‌-2021లో మేము రాణించాం. టీమిండియాను ఓడించాం. తర్వాత ఆసియా కప్‌ టోర్నీలోనూ వాళ్లని మట్టికరిపించాం.బిలియన్‌ డాలర్‌ ఎకానమీ ఉన్న బోర్డుకు చెందిన జట్టును మేము రెండుసార్లు ఓడించాం. అంతేకాదు  టీ20 వరల్డ్‌కప్‌-2022 ఫైనల్‌కు కూడా చేరుకున్నాం. 


రమీజ్‌ రాజా

వాళ్లు ఇక్కడికి రాలేమని చెబితే.. మేమూ అక్కడికి వెళ్లం. పాక్‌లేని వరల్డ్‌కప్‌ టోర్నీని ఎవరు చూస్తారు?’’ అంటూ తమ జట్టును ప్రశంసిస్తూ.. టీమిండియాను తక్కువ చేసే విధంగా మాట్లాడాడు రమీజ్‌ రాజా. అతడి వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌ కాగా.. తాజా వరల్డ్‌కప్‌ టోర్నీలో టీమిండియా చేతిలో ఓడిన విషయాన్ని మర్చిపోయారా అంటూ కౌంటర్‌ ఇస్తున్నారు.

ఆత్మవిశ్వాసం మంచిదేనని.. అయితే అతి విశ్వాసం ప్రదర్శిస్తే బొక్కబోర్లా పడకతప్పదంటూ రమీజ్‌ రాజాను ట్రోల్‌ చేస్తున్నారు. భారత జట్టును ఓడిస్తేనే మీది గొప్ప జట్టుగా మారిందన్న నీ వ్యాఖ్యలు మాత్రం నిజమని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రపంచకప్‌ టోర్నీలో ఆడకపోతే పాకిస్తాన్‌కు నష్టమని చురకలు అంటిస్తున్నారు. కాగా విరాట్‌ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌తో ప్రపంచకప్‌-2022 టోర్నీలో పాక్‌ భారత్‌ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే.

చదవండి: Umran Malik: ఉమ్రాన్‌ బౌలింగ్‌లో వైవిధ్యం లేదు.... ఇక వన్డేల్లోనే! అర్ష్‌దీప్‌ భేష్‌..
Ravindra Jadeja: వివాదాస్పదంగా జడేజా తీరు.. గాయం పేరు చెప్పి టూర్‌కు దూరం; కట్‌చేస్తే ఎన్నికల ప్రచారంలో

మరిన్ని వార్తలు