ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో పదేళ్లు హాకీకి స్పాన్సర్‌షిప్‌

18 Aug, 2021 07:51 IST|Sakshi

ఒడిశా సీఎం ప్రకటన

భువనేశ్వర్‌: భారత పురుషుల, మహిళల హాకీ జట్లకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన స్పాన్సర్‌గా కొనసాగుతుందని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ వెల్లడించారు. మంగళవారం ఇరు జట్లను ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మరో పదేళ్ల పాటు స్పాన్సర్‌షిప్‌ చేస్తామని చెప్పారు. ‘రెండు జట్లు తమ అద్భుత ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్‌లో కొత్త చరిత్ర లిఖించాయి.

దేశం యావత్తు గర్వపడేలా హాకీ జట్లు మైదానంలో పోరాడాయి. అసామాన పోరాట పటిమ చూసి భారత్‌ భావోద్వేగంతో ఉప్పొంగిపోయింది. జాతీయ క్రీడ హాకీతో మా అనుబంధం కొనసాగుతుంది’ అని అన్నారు. ఒక్కో ప్లేయర్‌కు రూ. 10 లక్షలు, సహాయ సిబ్బందికి రూ. 5 లక్షలు చొప్పున ప్రోత్సాహక బహుమతిగా అందజేసిన ఒడిషా ప్రభుత్వం హాకీ ఇండియాకు కూడా రూ. 50 లక్షలు అందించింది. 2018 నుంచి భారత హాకీ జట్లకు ‘టీమ్‌ స్పాన్సర్‌’గా ఒడిశా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇటీవల ముగిసిన ఒలింపిక్స్‌లో పురుషుల జట్టు 41 ఏళ్ల పతక నిరీక్షిణకు కాంస్యంతో తెరదించిన సంగతి తెలిసిందే. మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. 

మరిన్ని వార్తలు