అద్భుతం ఆవిష్కృతమైన వేళ.. నాటి వీడియో చూశారా? సచిన్‌ వీర విహారం..

24 Feb, 2023 17:48 IST|Sakshi
సచిన్‌ టెండుల్కర్‌ (PC: BCCI)

Sachin Tendulkar ODI Double Video: ఫిబ్రవరి 24, 2010.. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో గుర్తుండిపోయే రోజు.. భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ అప్పటికి ఎవరికీ సాధ్యం కాని రీతిలో సరికొత్త రికార్డు సృష్టించాడు. స్వదేశంలో సొంత ప్రేక్షకుల నడుమ వన్డే డబుల్‌ సెంచరీతో అద్భుతం ఆవిష్కరింపజేశాడు. 

చిరస్మరణీయ ఇన్నింగ్స్‌
వన్డేల్లో ద్విశతకం బాదిన తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. క్రికెట్‌ దేవుడి బ్యాట్‌ నుంచి జాలువారిన ఈ అజేయ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌కు 13 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బీసీసీఐ నాటి మరుపురాని దృశ్యాలను పంచుకుంది. టీమిండియా మాజీ ఓపెనర్‌ సచిన్‌ వన్డే డబుల్‌ సెంచరీకి సంబంధించిన వీడియోను షేర్‌ చేయగా వైరల్‌ అవుతోంది.

సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో..
2010లో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ నిమిత్తం సౌతాఫ్రికా భారత పర్యటనకు వచ్చింది. జైపూర్‌లోని తొలి మ్యాచ్‌లో ఒకే ఒక్క పరుగు తేడాతో గెలుపొందిన ఆతిథ్య భారత్‌.. రెండో వన్డేలో మాత్రం ఏకంగా 153 పరుగుల తేడాతో ప్రొటిస్‌ను చిత్తు చేసింది.

గ్వాలియర్‌లోని రూప్‌సింగ్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ వీర విహారం చేశాడు. 147 బంతుల్లో 25 ఫోర్లు, 3 సిక్సర్లతో విధ్వంసం సృష్టించి 200 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా వన్డేల్లో ద్విశతకం సాధించిన తొలి బ్యాటర్‌గా చరిత్రపుటల్లో తన పేరు లిఖించుకన్నాడు.

ఇక నాటి మ్యాచ్‌లో సచిన్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసిన టీమిండియా.. ఆసీస్‌ను 248 పరుగులకే కట్టడి చేసి ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. అయితే, ఆఖరి మ్యాచ్‌లో సౌతాఫ్రికా 90 పరుగుల తేడాతో గెలుపొంది క్లీన్‌స్వీప్‌ గండాన్ని తప్పించుకుంది.  

సచిన్‌ తర్వాత ఇప్పటి వరకు వన్డేల్లో డబుల్‌ సెంచరీ బాదిన క్రికెటర్లు వీరే
►రోహిత్‌ శర్మ(3 సార్లు, 264, 209, 208 నాటౌట్‌)
►వీరేంద్ర సెహ్వాగ్‌(219)
►మార్టిన్‌ గప్టిల్‌(237 నాటౌట్‌)
►క్రిస్‌ గేల్‌(215)
►ఫకర్‌ జమాన్‌(210 నాటౌట్‌)
►ఇషాన్‌ కిషన్‌(210)
►శుబ్‌మన్‌ గిల్‌(208)    

చదవండి: Ind Vs Aus: అంత సిల్లీగా అవుటవుతారా? అవునా అలా అన్నాడా? ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌కు హర్మన్‌ కౌంటర్‌.. 
Tim Southee: టిమ్‌ సౌథీ అరుదైన ఘనత.. సరికొత్త రికార్డు.. 700 వికెట్లతో..

>
మరిన్ని వార్తలు