PAK VS AUS 2nd Test: మాతృదేశంపై శతకం నమోదు చేసిన ఉస్మాన్‌ ఖ్వాజా 

12 Mar, 2022 21:17 IST|Sakshi

Usman Khawaja: కరాచీ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖ్వాజా (127; 13 ఫోర్లు, సిక్స్‌) అజేయ శతకంతో చెలరేగాడు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి పర్యాటక జట్టు 3 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఖ్వాజాకు తోడుగా స్టీవ్‌ స్మిత్‌ (72) అర్ధ సెంచరీతో రాణించగా, డేవిడ్‌ వార్నర్‌ (48 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించాడు. లబూషేన్‌ డకౌటయ్యాడు.

పాక్‌ బౌలర్లలో హసన్‌ అలీ, ఫహీమ్‌ అష్రఫ్‌ తలో వికెట్‌ దక్కించుకోగా, లబుషేన్‌ రనౌటయ్యాడు. తొలి టెస్ట్‌లో 3 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్న ఖ్వాజా, ఈ మ్యాచ్‌లో పట్టుదలగా ఆడి కెరీర్‌లో పదో శతకాన్ని నమోదు చేశాడు. పాక్‌లోనే జన్మించిన 35 ఏళ్ల ఖ్వాజా.. తన మాతృదేశంపై సెంచరీ సాధించడంతో పాకిస్థాన్‌ అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేశారు.  

కాగా, ఇరు జట్ల మధ్య రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్ట్‌ నిర్జీవమైన పిచ్‌ కారణంగా డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. జీవం లేని పిచ్‌ను తయారు చేసిందుకు గాను పాక్‌ క్రికెట్‌ బోర్డుపై ఇరు దేశాల మాజీ క్రికెటర్లు, అభిమానుల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాసిరకం పిచ్‌ను తయారు చేసి టెస్టు క్రికెట్‌కున్న గొప్పతనాన్ని నాశనం చేశారంటూ దుమ్మెత్తి పోశారు. ఈ పిచ్‌పై ఐసీసీ కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త పిచ్ అని.. కనీస ప్రమాణాలు కూడా పాటించకుండా నాసిరకమైన పిచ్‌ తయారు చేశారంటూ మ్యాచ్‌ రిఫరీ రంజన్‌ మదుగలే ఫైరయ్యాడు. 
చదవండి: 'టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త పిచ్‌'

మరిన్ని వార్తలు