Tri Series PAK Vs NZ Final: సంయుక్తంగా రాణించిన బ్యాటర్లు.. పాకిస్తాన్‌దే ట్రై సిరీస్‌

14 Oct, 2022 11:22 IST|Sakshi

న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌లతో జరిగిన ముక్కోణపు టి20 టోర్నీలో పాకిస్తాన్‌ విజేతగా నిలిచింది. టి20 ప్రపంచకప్‌ ఆరంభానికి ముందు పాకిస్తాన్‌కు ఈ విజయం మంచి ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రై సిరీస్‌కు ముందు ఆసియా కప్‌ ఫైనల్‌.. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ల్లో పాకిస్తాన్‌ ఓటమిపాలయింది. ఇక శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన ట్రై సిరీస్‌ ఫైనల్లో పాకిస్తాన్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 19.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. పాక్‌ బ్యాటర్లు మహ్మద్‌ రిజ్వాన్‌ (29 బంతుల్లో 34 పరుగులు), మహ్మద్‌ నవాజ్‌(22 బంతుల్లో 38 పరుగులు), హైదర్‌ అలీ(15 బంతుల్లో 31 పరుగులు).. చివర్లో ఇప్తికర్‌ అహ్మద్‌(14 బంతుల్లో 25 నాటౌట్‌) సంయుక్తంగా రాణించారు.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ 59 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. గ్లెన్‌ పిలిప్స్‌ 29, మార్క్‌ చాప్‌మన్‌ 25 పరుగులు చేశారు. పాక్‌ బౌలర్లలో నసీమ్‌ షా, హారిస్‌ రౌఫ్‌లు తలా రెండు వికెట్లు తీయగా.. షాదాబ్‌ ఖాన్‌, నవాజ్‌లు చెరొక వికెట్‌ తీశారు. రేపు(శనివారం) ఆస్ట్రేలియాకు బయలుదేరనున్న పాకిస్తాన్‌ జట్టు టి20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో అక్టోబర్‌ 23న(ఆదివారం)తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

చదవండి: జర్నలిస్ట్‌ తిక్క ప్రశ్న.. బాబర్‌ ఆజం దిమ్మతిరిగే కౌంటర్‌

మరిన్ని వార్తలు