Asia cup 2023: 'ఆసియా కప్ వేదికను మారిస్తే.. టోర్నీలో పాక్‌ ఆడదు.. అతిథ్య హక్కులు మావి.. అయినా'

3 Dec, 2022 09:31 IST|Sakshi

ఆసియాకప్‌-2023 షెడ్యూల్‌ ప్రకారం పాకిస్తాన్‌ వేదికగా జరగాల్సింది. ఈ క్రమంలో భారత జట్టు ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనేందుకు పాకిస్తాన్‌కు వెళ్లనుంది అని ఊహాగానాలు వినిపించాయి. అయితే కొన్ని రోజుల క్రితం ఈ ఊహాగానాలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రెసిడెంట్ జై షా తోసిపుచ్చారు. వచ్చే  ఏడాది ఆసియాకప్‌ తటస్థ వేదికపై జరుగుతుందని ప్రకటన చేశారు.

అప్పటి నుంచి ఈ టోర్నీ నిర్వహణపై వివాదం మొదలైంది. ఇక మరోసారి ఆసియాకప్‌ నిర్వహణపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ రమీజ్ రాజా కీలక వాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది తమ దేశంలో ఆసియాకప్‌ను నిర్వహించకపోతే.. ఈ టోర్నీ నుంచి పాకిస్తాన్‌ తప్పుకుంటుంది అని రమీజ్ రాజా తెలిపారు.

ఈఎస్పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో రమీజ్ మాట్లాడుతూ.. "మాకు టోర్నీని నిర్వహించే అతిథ్య హక్కులు ఇవ్వకపోతే.. మేము కావాలని వేడుకోము. ఎందుకంటే అతిథ్య హక్కులు పారదర్శకంగా మేము సంపాందించుకున్నాం. పాక్‌లో ఆడేందుకు భారత జట్టు రావడం రాకపోవడం వారి ఇష్టం.

కానీ ఆసియాకప్‌ను తటస్థ వేదికపై  నిర్వహిస్తే.. మేము టోర్నీ నుంచి వైదొలిగే అవకాశం ఉంది. భారత్‌ ఆసియాకప్‌లో పాల్గొనేందుకు పాకిస్తాన్‌కు వస్తే.. మా జట్టు ప్రపంచకప్‌లో ఆడేందుకు భారత్‌లో అడుగుపెడుతుంది. ఒకవేళ వాళ్లు రాకుంటే.. వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ భాగం కాదు. పాకిస్తాన్‌ టోర్నీలో లేకపోతే ఎవరు చూడరు. గత కొంత కాలంగా మా జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. టీ20 ప్రపంచకప్‌-2022 ఫైనల్లో కూడా ఆడాము" అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: IND vs BAN: టీమిండియాతో వన్డే సిరీస్‌.. బంగ్లాదేశ్‌ కెప్టెన్‌గా లిటన్‌ దాస్‌

మరిన్ని వార్తలు