పోర్చు‘గోల్స్‌’ మోత

8 Dec, 2022 01:51 IST|Sakshi
రామోస్‌

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 6–1తో స్విట్జర్లాండ్‌పై ఘనవిజయం

క్వార్టర్‌ ఫైనల్లో పోర్చుగల్‌

రామోస్‌ ‘హ్యాట్రిక్‌’  

దోహా: ఆరంభం నుంచి సూపర్‌ స్టార్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డోను ఆడించకపోయినా... తమ జట్టులో ప్రతిభావంతులకు కొదవలేదని నిరూపిస్తూ పోర్చుగల్‌ జట్టు ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో కళ్లు చెదిరే ప్రదర్శనతో మెరిసింది. ఆద్యంతం దూకుడుగా ఆడుతూ, పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ రొనాల్డో లేకున్నా పోర్చుగల్‌ జట్టు భవిష్యత్‌కు ఢోకా లేదని నిరూపించింది.

భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన చివరి ప్రిక్వార్టర్‌ ఫైనల్లో పోర్చుగల్‌ 6–1 గోల్స్‌ తేడాతో స్విట్జర్లాండ్‌ను చిత్తుగా ఓడించి 16 ఏళ్ల తర్వాత మళ్లీ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పోర్చుగల్‌ తరఫున తొలి ప్రపంచకప్‌లో ఆడుతున్న 21 ఏళ్ల గొన్సాలో రామోస్‌ (17వ, 51వ, 67వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్‌’ నమోదు చేయగా... పెపె (33వ ని.లో), రాఫెల్‌ గెరెరో (55వ ని.లో), రాఫెల్‌ లియా (90+2వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు. స్విట్జర్లాండ్‌ జట్టుకు మాన్యుయెల్‌ అకాంజీ (58వ ని.లో) ఏకైక గోల్‌ అందించాడు.

చివరిసారి 1954లో ప్రపంచకప్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన స్విట్జర్లాండ్‌ ఆ తర్వాత ఐదుసార్లు ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే నిష్క్రమించింది. మరోవైపు ఎనిమిదోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న పోర్చుగల్‌ మూడోసారి క్వార్టర్‌ ఫైనల్‌ దశకు అర్హత సాధించింది. 1966లో మూడో స్థానంలో నిలిచిన పోర్చుగల్, 2006లో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఈనెల 10న జరిగే క్వార్టర్‌ ఫైనల్లో మొరాకోతో పోర్చుగల్‌ తలపడుతుంది. 

తొలిసారి సబ్‌స్టిట్యూట్‌గా రొనాల్డో... 
వరుసగా ఐదో ప్రపంచకప్‌లో ఆడుతున్న పోర్చుగల్‌ కెప్టెన్‌ క్రిస్టియానో రొనాల్డో తొలిసారి తుది 11 మంది జట్టులో చోటు కోల్పోయాడు. రొనాల్డో స్థానంలో గొన్సాలో రామోస్‌ను తొలి నిమిషం నుంచి ఆడించాలని కోచ్‌ ఫెర్నాండో సాంటోస్‌ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. జాతీయ జట్టుకు ఒక్క మ్యాచ్‌ ఆడకుండానే నేరుగా ప్రపంచకప్‌ జట్టులో స్థానం సంపాదించిన రామోస్‌ ఘనా, ఉరుగ్వేలతో మ్యాచ్‌ల్లో సబ్‌స్టిట్యూట్‌గా చివరి నిమిషాల్లో బరిలోకి దిగాడు.

అయితే కీలకమైన మ్యాచ్‌లో అత్యంత అనుభవజ్ఞుడు, 37 ఏళ్ల రొనాల్డోను కాదని రామోస్‌ను ఆరంభం నుంచే ఆడించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే తన ఎంపిక సరైనదేనని రామోస్‌ నిరూపించుకున్నాడు. మూడు గోల్స్‌ చేయడమే కాకుండా గెరెరో గోల్‌ చేయడానికి రామోస్‌ సహాయపడ్డాడు. పోర్చుగల్‌ ఖాతాలో ఐదు గోల్స్‌ జమయ్యాక.. 74వ నిమిషంలో రొనాల్డోను జావో ఫెలిక్స్‌ స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి పంపించారు. ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో రొనాల్డో రిజర్వ్‌ బెంచ్‌కు పరిమితమై మ్యాచ్‌ మధ్యలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.  

మరిన్ని వార్తలు