PSL 2022: మూడు సిక్సర్లతో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేశాడు.. ఫలితం సూపర్‌ ఓవర్‌

22 Feb, 2022 13:54 IST|Sakshi

పాకిస్తాన్‌ స్టార్‌ బౌలర్‌ షాహిన్‌ అఫ్రిది బంతితోనే కాదు బ్యాట్‌తోను సత్తా చాటగలనని నిరూపించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు దిగిన అఫ్రిది ఆఖరి ఓవర్లో మూడు సిక్సర్లతో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. దీంతో ఫలితం సూపర్‌ ఓవర్‌ ద్వారా వచ్చింది. కానీ అఫ్రిదిని దురదృష్టం వెంటాడింది. సూపర్‌ ఓవర్‌లో తన జట్టు పరాజయం పాలైంది. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌ 2022)లో భాగంగా పెషావర్‌ జాల్మి, లాహోర్‌ ఖలందర్స్‌ మధ్య మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పెషావర్‌ జాల్మి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. హైదర్‌ అలీ 35, షోయబ్‌ మాలిక్‌ 32 పరుగులు సాధించారు.

చదవండి: ఎంతైనా పాక్‌ క్రికెటర్‌ కదా.. ఆ మాత్రం ఉండాలి

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లాహోర్‌ ఖలందర్స్‌ 96 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో మహ్మద్‌ హఫీజ్‌తో కలిసి కెప్టెన్‌ షాహిన్‌ అఫ్రిది కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఏడో వికెట్‌కు ఈ ఇద్దరు కలిసి 33 పరుగులు జోడించారు. కాగా 12 బంతుల్లో 30 పరుగుల చేయాల్సిన దశలో హఫీజ్‌ ఔటయ్యాడు. 19వ ఓవర్లో షాహిన్‌ ఒక ఫోర్‌ సహా మొత్తం ఆరు పరుగులు రాబట్టడంతో.. లాహోర్‌ ఖలందర్స్‌కు ఆఖరి ఓవర్లో విజయానికి 23 పరుగులు కావాలి. కాగా మహ్మద్‌ ఉమర్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో తొలి బంతి వైడ్‌ వెళ్లింది. మరుసటి బంతిని బౌండరీ తరలించాడు. రెండో బంతిని అఫ్రిది సిక్సర్‌ కొట్టడంతో 4 బంతుల్లో 13 పరుగులుగా మారిపోయింది. మూడో బంతిని లాంగాఫ్‌ దిశగా భారీ సిక్సర్‌గా మలవడంతో రెండు బంతుల్లో ఏడు పరుగులు కావాలి. ఐదో బంతికి పరుగు రాలేదు.

ఆఖరి బంతికి సిక్స్‌ కొడితే డ్రా.. లేదంటే ఓటమి. ఈ దశలో అఫ్రిది డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా కళ్లు చెదిరే సిక్స్‌ కొట్టాడు. ఫలితం సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. కాగా 20 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన షాహిన్‌.. సెలబ్రేషన్స్‌లో భాగంగా మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిదిని గుర్తుచేస్తూ ఫోజివ్వడం వైరల్‌గా మారింది. ఇక సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లాహోర్‌ ఖలందర్స్‌ ఐదు పరుగులు మాత్రమే చేయగలిగింది. పెషావర్‌ విజయానికి ఆరు పరుగులు మాత్రమే అవసరం. షోయబ్‌ మాలిక్‌ తొలి రెండు బంతులను ఫోర్‌గా మలచడంతో పెషావర్‌ జాల్మి విజయాన్ని అందుకుంది. 

చదవండి: నువ్వు ప్రపంచానికి కింగ్‌ కోహ్లివి కావొచ్చు.. కానీ నాకు మాత్రం

మరిన్ని వార్తలు