టీ20, వన్డేలకు అతడే సరైన కెప్టెన్‌.. కానీ నా అల్లుడి విషయంలో: షాహిద్‌ ఆఫ్రిది

18 Nov, 2023 10:06 IST|Sakshi

Pakistan Cricket Captains: పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్ల మార్పుపై మాజీ సారథి షాహిద్‌ ఆఫ్రిది స్పందించాడు. టీ20 కెప్టెన్‌గా షాహిన్‌ షా ఆఫ్రిది నియామకంలో తన ప్రమేయమేమీ లేదని స్పష్టం చేశాడు. తన అల్లుడి కోసం ఎలాంటి లాబీయింగ్‌ చేయలేదని పేర్కొన్నాడు.

కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో పాకిస్తాన్‌ వైఫల్యం నేపథ్యంలో బాబర్‌ ఆజం సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. భారత్‌ వేదికగా ఈ ఐసీసీ టోర్నీలో దారుణ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు.

షాహిన్‌ కెప్టెన్‌ కావాలని కోరుకోలేదు
ఈ నేపథ్యంలో స్టార్‌ పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిదిని టీ20 కెప్టెన్‌గా నియమించిన పాక్‌ క్రికెట్‌ బోర్డు.. టెస్టు పగ్గాలను షాన్‌ మసూద్‌కు అప్పగించింది. ఈ క్రమంలో టీ20 సారథిగా షాహిద్‌ నియామకంలో మాజీ కెప్టెన్‌ షాహిద్‌ ఆఫ్రిది ప్రమేయం ఉందనే వదంతులు వ్యాపించాయి.

తన అల్లుడి కోసం ఆఫ్రిది పీసీబీ పెద్దల వద్ద లాబీయింగ్‌ చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన ఆఫ్రిది.. ‘‘నేను అసలు ఇలాంటి విషయాల్లో తలదూర్చను. షాహిద్‌తో నాకున్న బంధుత్వం కారణంగా ఇలాంటి మాటలు వినిపిస్తాయని నాకు తెలుసు. ఒకవేళ నేను లాబీయింగ్‌ చేసే వాడినే అయితే.. పీసీబీ చైర్మన్‌ను ఎందుకు విమర్శిస్తాను? నేను ఏ రోజూ కూడా షాహిన్‌ను కెప్టెన్‌ చేయాలని డిమాండ్‌ చేయలేదు.


మహ్మద్‌ రిజ్వాన్‌తో బాబర్‌ ఆజం

నిజానికి అతడు సారథ్య బాధ్యతలకు దూరంగా ఉండాలనే కోరుకున్నా. అయితే, షాహిన్‌ను సారథిగా నియమించాలన్నది పూర్తిగా పీసీబీ చైర్మన్‌, మహ్మద్‌ హఫీజ్‌ నిర్ణయం. ఇందులో నా ప్రమేయమేమీ లేదు. 

టీ20, వన్డేలకు అతడే సరైన కెప్టెన్‌
బాబర్‌ ఆజంనే కెప్టెన్‌గా కొనసాగించాలని పీసీబీ చైర్మన్‌తో గతంలో చెప్పాను. ఒకవేళ అతడు తప్పుకోవాలని భావిస్తే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మహ్మద్‌ రిజ్వాన్‌ను కెప్టెన్‌గా చేయాలని.. టెస్టుల్లో మాత్రం బాబర్‌నే కొనసాగించాలని పీసీబీకి చెప్పాను’’ అని సామా టీవీ షోలో పేర్కొన్నాడు. కాగా షాహిద్‌ ఆఫ్రిది పెద్ద కుమార్తె అన్షాను షాహిన్‌ వివాహమాడిన విషయం తెలిసిందే.

చదవండి: CWC 2023: ద్రవిడ్‌తో కలిసి పిచ్‌ పరిశీలించిన రోహిత్‌! క్యూరేటర్‌ చెప్పిందిదే!

మరిన్ని వార్తలు