మహ్మద్‌ రిజ్వాన్‌ విధ్వంసకర శతకం.. 18 బంతుల్లోనే..!

23 Feb, 2023 13:15 IST|Sakshi

PSL 2023: పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2023 సీజన్‌లో ముల్తాన్‌ సుల్తాన్స్‌ కెప్టెన్‌, పాక్‌ స్టార్‌ ప్లేయర్‌  మహ్మద్ రిజ్వాన్‌ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన 4 మ్యాచ్‌ల్లో వరుసగా 75, 28 నాటౌట్‌, 66, 50 స్కోర్లు చేసిన రిజ్వాన్‌.. నిన్న (ఫిబ్రవరి 22) కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరింతగా రెచ్చిపోయి ఉగ్రరూపం దాల్చాడు.

60 బంతుల్లోనే శతకం బాది, పీఎస్‌ఎల్‌లో తన మొదటి సెంచరీని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో తొలి హాఫ్‌ సెంచరీ చేసేందుకు 42 బంతులు తీసుకున్న రిజ్వాన్‌.. రెండో హాఫ్‌ సెంచరీని కేవలం 18 బంతుల్లోనే పూర్తి చేసి పీఎస్‌ఎల్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. మొత్తంగా ఈ ఇన్నింగ్స్‌లో 64 బంతులు ఎదుర్కొన్న రిజ్వాన్‌..10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన అతని జట్టు నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఛేదనలో కరాచీ కింగ్స్‌ సైతం అద్భుతంగా పోరాడింది. జేమ్స్‌ విన్స్‌ (34 బంతుల్లో 75; 7 ఫోర్లు, 6 సిక్సర్లు), కెప్టెన్‌ ఇమాద్‌ వసీం​ (26 బంతుల్లో 46 నాటౌట్‌; 5 సిక్సర్లు) సునామీ ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడినప్పటికీ ఆ జట్టు లక్ష్యానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

నిర్ణీత ఓవర్లలో కరాచీ కింగ్స్‌ 5 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేయగలిగింది. కింగ్స్‌ జట్టులో విన్స్‌, ఇమాద్‌ మినహా మిగతా వారెవ్వరూ రాణించలేదు. కాగా, ప్రస్తుత సీజన్‌లో భీకర ఫామ్‌లో ఉన్న రిజ్వాన్‌ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 109.66 సగటున, 144 స్ట్రయిక్‌ రేట్‌తో సెంచరీ, 3 హాఫ్‌ సెంచరీల సాయంతో 329 పరుగులు చేసి, సీజన్‌ టాప్‌ స్కోరర్‌గా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.

ఓవరాల్‌గా రిజ్వాన్‌ గత 10 టీ20 ఇన్నింగ్స్‌లో 6 హాఫ్‌సెంచరీలు, ఓ సెంచరీ సాధించి కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌ను కనబరుస్తున్నాడు. అతని ఫామ్‌ కారణంగా ముల్తాన్‌ సుల్తాన్స్‌ ప్రస్తుత సీజన్‌లో వరుసగా నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. 

మరిన్ని వార్తలు