Cheteshwar Pujara: సెంచరీల మీద సెంచరీలు.. గ్యాప్‌లో పాక్‌ బౌలర్‌కు చుక్కలు

8 May, 2022 13:00 IST|Sakshi

టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా సూపర్‌ ఫామ్‌ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడా తగ్గేదే లే అంటున్న పుజారా మరో సెంచరీతో చెలరేగాడు. ఈ గ్యాప్‌లోనే పాకిస్తాన్‌ స్టార్‌ బౌలర్‌ షాహిన్‌ అఫ్రిదికి చుక్కలు చూపించాడు. ఇక ఫామ్‌ కోల్పోయి టీమిండియా జట్టులో చోటు కోల్పోయిన పుజారా.. కౌంటీ క్రికెట్‌లో మాత్రం దుమ్మురేపుతున్నాడు.

టీమిండియా జట్టులోకి తిరిగి రావాలనే కసితో ఆడుతున్న పుజారా కౌంటీ చాంపియన్‌షిప్‌లో ససెక్స్‌ తరపున ఇప్పటికే రెండు డబుల్‌ సెంచరీలు, ఒక సెంచరీతో మెరిశాడు. తాజాగా మిడిలెసెక్స్‌తో మ్యాచ్‌లో ఆదివారం పుజారా నాలుగో సెంచరీతో మెరిశాడు. రెండో ఇన్నింగ్స్‌లో టామ్‌ ఆల్సప్‌(66)తో కలిసి నాలుగో వికెట్‌కు 138 పరుగులు జోడించిన పుజారా..  ఆ తర్వాత టామ్‌ క్లార్క్‌తో(26*) కలిసి 92 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. ఓవరాల్‌గా మూడోరోజు ఆట ముగిసేసమయానికి పుజారా(149 బంతుల్లో 125 బ్యాటింగ్‌, 16 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్‌ క్లార్క్‌(26 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

పుజారా మెరుపులతో ససెక్స్‌ 270 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు మిడిలెసెక్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ససెక్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో 392 పరుగులకు ఆలౌటైంది. కాగా పుజారాకు ఈ సీజన్‌లో ఇది నాలుగో సెంచరీ కాగా.. ఇంతకముందు 201*(డెర్బీషైర్‌ జట్టుపై), 109(వోర్సెస్టర్‌షైర్‌ జట్టుపై), 203(డర్హమ్‌ జట్టుపై) సెంచరీలు అందుకున్నాడు.

గ్యాప్‌లో పాక్‌ బౌలర్‌కు చుక్కలు..
సెంచరీతో మెరిసిన పుజారా షాహిన్‌ అఫ్రిది బౌలింగ్‌లో కళ్లు చెదిరే సిక్సర్‌ కొట్టడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ససెక్స్‌ రెండో ఇన్నింగ్స్‌ సమయంలో ఇది చోటుచేసుకుంది. ఓపెనర్ల వికెట్లు ఆరంభంలోనే కోల్పోవడంతో ససెక్స్‌ కష్టాల్లో పడింది. ఈ దశలో పుజారా, టామ్‌ ఆల్సప్‌లు జాగ్రత్తగా ఆడారు. అయితే పుజారా తన ఇన్నింగ్స్‌ను దూకుడుగానే ఆరంభించాడు. షాహిన్‌ అఫ్రిది ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ మూడో బంతిని బౌన్సర్‌ వేశాడు. అయితే పుజారా దానిని వదలకుండా బ్యాట్‌ ఎడ్జ్‌తో అప్పర్‌ కట్‌ చేశాడు. దీంతో బంతి బౌండరీ ఫెన్స్‌ దాటి అవతల పడింది. పుజారా కెరీర్‌లో అతి తక్కువగా ఆడిన షాట్లలో అప్పర్‌ కట్‌ ఒకటి. ఇక పుజారా, అఫ్రిదిలు ఎదురుపడడం ఇదే తొలిసారి. 

మరిన్ని వార్తలు