Ball Tampering:ఇక్కడితో ముగించండి.. ఆసీస్‌ బౌలర్ల వేడుకోలు

18 May, 2021 15:36 IST|Sakshi

సిడ్నీ: క్రికెట్‌లో బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం పెను దుమారం రేపింది. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌లో బాన్‌క్రాఫ్ట్‌ బంతికి స్యాండ్‌ పేపర్‌ను రుద్దుతూ కెమెరాలకు చిక్కాడు. దాంతో ఆగ్రహించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా... బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలు... స్మిత్, వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం విధించింది. అయితే బ్యాన్‌క్రాఫ్ట్‌ తాజాగా ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ..తాను బాల్‌ టాంపరింగ్‌ చేయడం ఆసీస్‌ జట్టులో మిగతా బౌలర్లకు కూడా తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం మరోసారి చర్చనీయాంశమైంది. బాల్‌ టాంపరింగ్‌ ఉదంతంలో మిగతా బౌలర్ల హస్తం ఉందంటూ అక్కడి మీడియా కోడై కూసింది. ఈ విషయంపై ఆసీస్‌ క్రీడా జర్నలిస్టులు సీఏపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో రంగంలోకి దిగిన సీఏ బ్యాన్‌క్రాఫ్ట్‌ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న సీఏ మరోమారు విచారణకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అప్పటి మ్యాచ్‌లో బౌలర్లుగా ఉన్న పాట్‌ కమిన్స్‌, హాజిల్‌వుడ్‌, నాథన్‌ లియోన్‌, మిచెల్‌ స్టార్క్‌లు స్పందించారు. ఆసీస్‌ ప్రజలను ఉద్దేశిస్తూ ఈ నలుగురు కలిసి ఒక సుధీర్ఘ లేఖను విడుదల చేశారు. 

ఆ లేఖ సారాంశం ఇలా ఉంది.''ఆస్ట్రేలియన్‌ ప్రజలారా..మా నిజాయితీపై మాకు పూర్తి నమ్మకముంది. మా సమగ్రత, వ్యక్తిత్వంపై కొందరు ఆస్ట్రేలియన్‌ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలు మాకు బాధ కలిగించాయి. అయినా ఈ ప్రశ్నలకు మేం వివిధ సందర్బాల్లో ఎన్నోసార్లు  సమాధానాలు ఇచ్చాము. ఒకవేళ అవసరం అనుకుంటే.. మరోసారి దానిపై చర్చ పెట్టండి.. అందుకు మేం సిద్ధంగా ఉన్నాం. వాస్తవానికి ఆరోజు మ్యాచ్‌లో బంతి షేప్‌ మార్చడానికి బయటనుంచి మైదానంలోకి ఒక పదార్థం తీసుకొచ్చారన్న సంగతి మాకు తెలియదు. బాల్‌ టాంపరింగ్‌ జరిగిందని అంపైర్లు గుర్తించాకా.. మైదానంలో ఉన్న స్క్రీన్‌పై బంతి షేప్‌ మారిందంటూ చూపించిన తర్వాత మాకు మిషయం అర్థమైంది. ఆరోజు మ్యాచ్‌లో ఉ‍న్న ఇద్దరు అంపైర్లు నీల్‌ లాంగ్‌, రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌.. మంచి అనుభవం కలిగినవారు. వారిద్దరు బంతిని పరిశీలించి షేప్‌ మారిందని చెప్పారు.

బ్యాన్‌క్రాఫ్ట్‌ అప్పటికే సాండ్‌పేపర్‌కు బంతిని రుద్దాడని మాకు తెలియదు. కానీ అతను బాల్‌ టాంపరింగ్‌ చేస్తున్నట్లు ఇతర బౌలర్లకు కూడా తెలుసని చెప్పాడు. ఇది నిజం కాదు. ఒక బౌలర్‌గా మా బాధ్యత బంతులు విసరడం మాత్రమే.. బంతి షేప్‌ మారిందంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. అవన్నీ మాకెలా తెలుస్తాయి. వార్నర్‌, స్మిత్‌, బ్యాన్‌క్రాఫ్ట్‌లు చేసింది తప్పు కాబట్టే శిక్ష అనుభవించారు. కానీ ఈ ఉదంతం నుంచి మంచి పాఠాలు నేర్చుకున్నాం. మేము ఆటను ఆడే విధానం.. మైదానంలో ప్రవర్తించే తీరును ప్రజలు మంచి దృష్టితో చూడాలి. ఇలాంటి పుకార్లు, అవాస్తవాలను నమ్మద్దొని కోరుకుంటున్నాం. ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది.. ఇక ఇది ముందుకు సాగవలసిన సమయం.'' అంటూ ముగించారు.
చదవండి: వార్నర్‌ రిటైరైన తర్వాత బుక్‌ రాస్తాడని భావిస్తున్నా: బ్రాడ్‌

ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు గిల్‌క్రిస్ట్‌ సంచలన వ్యాఖ్యలు

A post shared by 7Cricket (@7cricket)

మరిన్ని వార్తలు