Rafael Nadal: అత్యాశ లేదు... కానీ ఇప్పుడైతే ‘21’ మాత్రం సరిపోదు: టెన్నిస్‌ స్టార్‌

4 Feb, 2022 10:20 IST|Sakshi

గ్రాండ్‌స్లామ్‌ విజయాలపై నాదల్‌  

Rafael Nadal Comments: - మలోర్కా (స్పెయిన్‌): పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ (21) గెలిచి శిఖరాన ఉన్న రాఫెల్‌ నాదల్‌ మరిన్ని మెగా టోర్నీలు గెలవాలని భావిస్తున్నాడు. ఇప్పటివరకు సాధించిన ఘనతతో ఆగిపోనని... అయితే అందు కోసం దేనికైనా సిద్ధమే అన్నట్లుగా వెంటపడనని కూడా నాదల్‌ వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచిన అనంతరం తన స్వస్థలం చేరుకొని సొంత అకాడమీలో నాదల్‌ మీడియాతో మాట్లాడాడు.

‘నేను భవిష్యత్తులో ఎన్ని గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలుస్తాననేది చెప్పలేను. కొన్నాళ్ల క్రితం వరకు కూడా గెలుపు సంగతేమో కానీ ఆడగలిగితే చాలని భావించాను. మిగతా ఇద్దరికంటే నేను ఎక్కువ గ్రాండ్‌స్లామ్‌లు సాధించాలని కోరుకుంటున్నాను. అలా జరిగితే చాలా సంతోషం. కానీ ఎలాగైనా గెలవాలనే పిచ్చి మాత్రం నాకు లేదు. నిజంగా ఇది నిజం. నా దారిలో వచ్చేవాటిని అందుకుంటూ పోవడమే తప్ప అత్యాశ కూడా పడటం లేదు. అయితే నిజాయితీగా చెప్పాలంటే ఇప్పుడైతే ‘21’ మాత్రం సరిపోదు. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు’ అని ఈ దిగ్గజ ఆటగాడు అన్నాడు.

ఇక సుదీర్ఘ కాలంగా కాలి నొప్పితో బాధపడుతున్నా అలాగే ఆటను కొనసాగించానని అతను పేర్కొన్నాడు. ‘ఆడుతున్నప్పుడు నా పాదం ఇప్పటికీ నన్ను ఇబ్బంది పెడుతుంది. అయితే అత్యుత్తమ స్థాయి ఆట ఆడేటప్పుడు దానిని పట్టించుకోలేదు. తాజా విజయంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అందుకే ఇక ముందూ టెన్నిస్‌ను బాగా ఆస్వాదించగలను. సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లతో తలపడాలని కోరుకుంటున్నా’ అని స్పెయిల్‌ బుల్‌ స్పష్టం చేశాడు.  

నాదల్‌–ఫెడరర్‌ కలిసి... 
దిగ్గజ ఆటగాళ్లు నాదల్, రోజర్‌ ఫెడరర్‌ మరో సారి ఒకే జట్టులో కలిసి ఆడనున్నారు. సెప్టెంబర్‌ 23నుంచి జరిగే ‘లేవర్‌ కప్‌’ టోర్నీలో వీరిద్దరు టీమ్‌ యూరోప్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని నిర్వాహకులు వెల్లడించారు. 2017లో ఇదే టోర్నీలో వీరిద్దరు జోడీగా ఆడి డబుల్స్‌ మ్యాచ్‌ గెలిచారు.    

చదవండి: Novak Djokovic: నాదల్‌ 21వ గ్రాండ్‌స్లామ్‌.. జొకోవిచ్‌ దిగిరానున్నాడా!

మరిన్ని వార్తలు