Rafael Nadal: దిగజారిన నాదల్‌.. 18 ఏళ్లలో ఇదే తొలిసారి 

21 Mar, 2023 16:34 IST|Sakshi

స్పెయిన్‌ బుల్‌.. టెన్నిస్‌ స్టార్‌ రఫేల్‌ నాదల్‌ 18 ఏళ్ల తర్వాత టాప్‌-10 ర్యాంకింగ్స్‌ నుంచి దిగువకు పడిపోయాడు. గాయం కారణంగా జనవరి నుంచి ఆటకు దూరంగా ఉన్న నాదల్‌ క్రమేపీ ర్యాంకింగ్స్‌లో దిగజారుతూ వచ్చాడు. తాజాగా ఇండియన్‌ వెల్స్‌ టెన్నిస్‌ టోర్నీ ముగిసిన తర్వాత విడుదల చేసిన పురుషుల టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌లో నాదల్‌ 13వ స్థానంలో నిలిచాడు.

కాగా 2005లో తొలిసారి టెన్నిస్‌లో టాప్‌-10లోకి ఎంటర్‌ అయిన నాదల్‌ అప్పటినుంచి 18 ఏళ్ల పాటు టాప్‌-10లోనే కొనసాగాడు. ఒక రకంగా ఇన్నేళ్లపాటు టాప్‌-10లో కొనసాగడం కూడా నాదల్‌కు రికార్డే. గతంలో 209 వారాల పాటు నెంబర్‌వన్‌గా ఉండి చరిత్ర సృష్టించిన నాదల్‌ ఐదుసార్లు నెంబర్‌వన్‌ ర్యాంక్‌తో ఏడాదిని ముగించాడు. నాదల్‌ తర్వాత జిమ్మీ కానర్స్‌ 15 ఏళ్ల పాటు టాప్‌-10లో కొనసాగాడు. ప్రస్తుతం నాదల్‌, జొకోవిచ్‌తో కలిసి 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో సంయుక్తంగా కొనసాగుతున్నాడు.

ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో రెండో రౌండ్‌లో వెనుదిరిగిన నాదల్‌ అనంతరం తుంటి గాయం బారిన పడ్డాడు. గాయం నుంచి నుంచి కోలుకున్న నాదల్‌ వచ్చే నెలలో జరగనున్న మాంటే కార్లో టెన్నిస్‌ టోర్నమెంట్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ టోర్నీలో నాదల్‌కు మంచి రికార్డు ఉంది. ఇ‍ప్పటివరకు 11సార్లు మాంటే కార్లో టైటిల్‌ నెగ్గిన నాదల్‌ ఓపెన్‌ శకంలో 2005 నుంచి 2012 వరకు వరుసగా ఎనిమిది సార్లు టైటిల్‌ నెగ్గి చరిత్ర సృష్టించాడు.  

ఇక ఇండియన్‌ వెల్స్‌ టోర్నీలో విజేతగా నిలిచిన స్పెయిన్‌ యువ సంచలనం కార్లోస్‌ అల్కరాజ్‌ ప్రపంచ టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌గా అవతరించాడు.​ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌ ఏటీపీ మాస్టర్స్‌–1000 టోర్నీలో 19 ఏళ్ల అల్‌కరాజ్‌ తొలిసారి విజేతగా అవతరించాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ అల్‌కరాజ్‌ 6–3, 6–2తో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా)పై గెలుపొందాడు.

ఈ టోర్నీకి ముందు సెర్బియా స్టార్‌ జొకోవిచ్‌ టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాడు. కోవిడ్‌ టీకా వేసుకోని విదేశీయులకు అమెరికాలో ప్రవేశం లేకపోవడంతో జొకోవిచ్‌ ఈ టోరీ్నకి దూరం కావాల్సి వచ్చింది. 7,160 పాయింట్లతో జొకోవిచ్‌ రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. సోమవారం మొదలైన మయామి ఓపెన్‌ టోర్నీలోనూ అల్‌కరాజ్‌ విజేతగా నిలిస్తేనే నంబర్‌వన్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకుంటాడు. లేదంటే ఏప్రిల్‌ 3న విడుదల చేసే ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్‌ మళ్లీ టాప్‌ ర్యాంక్‌ను దక్కించుకుంటాడు. 

చదవండి: వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఎంతవరకు విజయవంతం?

మరిన్ని వార్తలు