కాంట్రాక్ట్‌ పొడిగింపునకు నో చెప్పిన ద్రవిడ్‌.. టీమిండియా కొత్త హెడ్‌ కోచ్‌ అతడే..?

23 Nov, 2023 12:18 IST|Sakshi

టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం వరల్డ్‌కప్‌ 2023 ఫైనల్‌తో ముగిసింది. 2021 నవంబర్‌లో బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్‌ రెండేళ్ల పాటు పదవిలో కొనసాగాడు. వరల్డ్‌కప్‌ ఫైనల్లో టీమిండియా ఓటమి నేపథ్యంలో ద్రవిడ్‌ భారత జట్టు కోచింగ్‌ పదవికి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ద్రవిడ్‌ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, సన్నిహితులతో స్పష్టం చేశాడని సమాచారం. వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ముగిసిన అనంతరం కోచ్‌గా కొనసాగడంపై ఇంకా తేల్చుకోలేదని చెప్పిన ద్రవిడ్‌ తాజాగా బీసీసీఐ పెద్దల వద్ద నో చెప్పాడని తెలుస్తుంది. 

ద్రవిడ్‌ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చిన వెంటనే భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా ప్రస్తుత ఎన్‌సీఏ చీఫ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ను నియమిస్తారని సమాచారం. ఈ విషయంపై బీసీసీఐ పెద్దలు పూర్తి క్లారిటీగా ఉన్నారని తెలుస్తుంది. లక్ష్మణ్‌కు పట్టం కట్టేందుకు బీసీసీఐ ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నట్లు వినికిడి. ప్రస్తుతం లక్ష్మణ్‌ స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్‌ తాత్కాలిక హెడ్‌ కోచ్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఒకటి రెండు రోజుల్లో బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గత రెండేళ్ల కాలంలో ద్రవిడ్‌ గైర్హాజరీలో లక్ష్మణ్‌ పలు సిరీస్‌ల్లో టీమిండియా కోచ్‌గా వ్యవహరించాడు. 

లక్ష్మణ్‌ టీమిండియా హెడ్‌ కోచ్‌ బాధ్యతలు చేపట్టిన అనంతరం ద్రవిడ్‌ ఎన్‌సీఏ చీఫ్‌గా ట్రాన్స్‌ఫర్‌ అవుతాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ద్రవిడ్‌ ఓ ఐపీఎల్‌ జట్టుతో జత కట్టనున్నాడని టాక్‌ కూడా నడుస్తుంది. మొత్తానికి ద్రవిడ్‌ దిగిపోతే టీమిండియా హెడ్‌ కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌కు పట్టం కట్టేందుకు సర్వం సిద్దమైందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా వైజాగ్‌లోని వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా ఇవాళ భారత్‌-ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్‌ జరుగనున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు