CWC 2023: ఆసీస్‌ స్టార్‌ ఆటగాడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

24 Nov, 2023 12:50 IST|Sakshi

ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాడు మిచెల్‌ మార్ష్‌పై భారత్‌లో కేసు నమోదైంది. ఆస్ట్రేలియా 2023 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన అనంతరం మార్ష్‌ వరల్డ్‌కప్‌ ట్రోఫీపై కాళ్లు పెట్టి భారతీయుల మనోభావాలను దెబ్బతీశాడని ఆరోపిస్తూ  అలీఘర్‌కు చెందిన ఆర్‌టిఐ కార్యకర్త పండిట్ కేశవ్ ఢిల్లీ గేట్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశాడు.

మార్ష్‌ చర్య ప్రతిష్టాత్మకమైన ట్రోఫీకే కాకుండా 140 కోట్ల మంది భారతీయులకు అవమానం కలిగించిందని ఆరోపించాడు. కేశవ్‌ తన ఫిర్యాదు కాపీని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు పంపించాడు. మార్ష్‌‌ భారత్‌లో ఏ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడకుండా జీవితకాల నిషేధం విధించాలని అతను డిమాండ్ చేశాడు. కేశవ్‌ ఫిర్యాదును స్వీకరించిన ఢిల్లీ గేట్ పోలీసులు మార్ష్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

కాగా, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం (నవంబర్‌ 19) జరిగిన వరల్డ్‌కప్ 2023 ఫైనల్లో భారత్‌పై ఆస్ట్రేలియా  ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది, ఆరో సారి జగజ్జేతగా నిలిచింది. ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచామన్న గర్వంతో మార్ష్ వరల్డ్‌కప్‌ ట్రోఫీపై కాళ్లు పెట్టుకుని ఫోటోలకు పోజులిచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో తెగ వైరలయ్యాయి. మార్ష్‌పై క్రికెట్‌ అభిమానులు దుమ్మెత్తిపోశాడు. ఏమా ఖండకావరం అంటూ ధ్వజమెత్తారు. భారత అభిమానులయితే మార్ష్‌ ఓ రేంజ్‌లో ఏ​కి పారేశారు. 

మరిన్ని వార్తలు