ICC Test All Rounder Rankings: అదరగొట్టిన జడేజా.. టెస్టుల్లో మరోసారి నెంబర్‌వన్‌గా

23 Mar, 2022 16:53 IST|Sakshi

ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మరోసారి నెంబర్‌వన్‌గా నిలిచాడు. 385 పాయింట్లతో జడ్డూ తొలి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో విండీస్‌ ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌(357 పాయింట్లు) ఉన్నాడు. ఇటీవలే శ్రీలంకతో సిరీస్‌లో విశేషంగా రాణించిన జడేజా మార్చి 9న విడుదల చేసిన ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్స్‌ విభాగంలో నెంబర్‌వన్‌గా నిలిచాడు. దాదాపు వారం పాటు నెంబర్‌వన్‌గా ఉన్న జడేజా విండీస్‌ ఆల్‌రౌండర్‌ హోల్డర్‌కు మరోసారి కోల్పోయాడు.

తాజాగా మరోసారి నెంబర్‌వన్‌గా నిలిచిన జడేజా, హోల్డర్‌కు మధ్య దాదాపు 28 పాయింట్ల వ్యత్యాసం ఉండడం విశేషం. మరో రెండు నెలల పాటు ఎలాంటి టెస్టు సిరీస్‌లు లేకపోవడంతో జడేజా కొన్నాళ్ల పాటు అగ్రస్థానంలో ఉండే అవకాశం ఉంది. ఇక మూడో స్థానంలో టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(341 పాయింట్లు) ఉన్నాడు.

ఇక బ్యాటింగ్‌ విభాగంలో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం అదరగొట్టాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో విశేషంగా రాణిస్తున్న బాబర్‌ మూడు స్థానాలు ఎగబాకి 799 పాయింట్లతో టాప్‌-5లో చోటు దక్కించుకున్నాడు. మరో పాక్‌ ఆటగాడు మహ్మద్‌ రిజ్వాన్‌ ఆరు స్థానాలు ఎగబాకి వార్నర్‌తో కలిసి సంయుక్తంగా 11వ స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా కరాచీ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 160.. రెండో ఇన్నింగ్స్‌లో 44 నాటౌట్‌తో ఆకట్టుకున్నాడు. ఇక ర్యాంకింగ్స్‌లో ఏకంగా 11 స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో నిలిచాడు. తొలి నాలుగు స్థానాల్లో ఉన్న లబుషేన్‌, రూట్‌, స్మిత్‌, విలియమ్సన్‌ ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పు లేదు. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఒక స్థానం దిగజారి 754 పాయింట్లతో ఏడో స్థానంలో ఉండగా.. కోహ్లి తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.

ఇక బౌలర్ల విభాగంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ 885 పాయింట్లతో తొలి స్థానాన్ని నిలుపుకోగా.. టీమిండియా స్పిన్నర్‌ అశ్విన్‌ 850 పాయింట్లతో రెండో స్థానం.. బుమ్రా 830 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నాడు.

చదవండి: Babar Azam: నిబంధనను పాతరేసిన పాక్‌ కెప్టెన్‌.. యాక్షన్‌ తీసుకోవాల్సిందే!

క్రికెట్‌ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు..

మరిన్ని వార్తలు