Shahbaz Ahmed: 2.4 కోట్లు పెట్టి కొన్నారు.. గల్లీ క్రికెటర్‌ కంటే హీనం.. పైగా ఆల్‌రౌండరట..!

27 Apr, 2023 08:58 IST|Sakshi
photo credit: IPL Twitter

IPL 2023 RCB VS KKR: ఐపీఎల్‌ 2023లో ఆర్సీబీ ఆల్‌రౌండర్‌ షాబాజ్‌ అహ్మద్‌ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఈ సీజన్‌లో అతనాడిన 8 మ్యాచ్‌ల్లో వికెట్లేమీ తీయకపోగా.. బ్యాటింగ్‌లో కేవలం 42 పరుగులు (10.50 సగటు, 107.69 స్ట్రయిక్‌ రేట్‌) మాత్రమే చేశాడు. 

ఈ సీజన్‌లో అతడి గణాంకాలు ఇలా ఉన్నాయి..

  • కేకేఆర్‌పై 1 (5), 0/25 (ఒక్క ఓవర్‌)
  • ఢిల్లీపై 20 (12), 0/11
  • సీఎస్‌కేపై 12 (10)
  • పంజాబ్‌పై 5 (3)
  • రాజస్థాన్‌పై 2 (4)
  • కేకేఆర్‌పై 2 (5), 0/6

ఈ దారుణ ప్రదర్శన నేపథ్యంలో షాబాజ్‌ అహ్మద్‌పై ఆర్సీబీ ఫ్యాన్స్‌ నిప్పులు చెరుగుతున్నారు. 2.4 కోట్లు పెట్టి కొన్నారు.. గల్లీ క్రికెటర్ల కంటే హీనంగా ఆడుతున్నాడంటూ పరుష పదజాలంతో దూషిస్తున్నారు. షాబజ్‌ను వెంటనే జట్టును తొలగించి, వేరే ఆటగాడిని రిక్రూట్‌ చేసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇతనితో పాటు దినేశ్‌ కార్తీక్‌ను కూడా వెంటనే జట్టు నుంచి తప్పించి, ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాలని పట్టుబడుతున్నారు. లేకపోతే ఈ ఏడాది కూడా తాము టైటిల్‌ గెలవలేమని అంటున్నారు.  

కేకేఆర్‌తో నిన్న (ఏప్రిల్‌ 26) జరిగిన మ్యాచ్‌లో షాబాజ్‌ ప్రదర్శన (1 (5), 0/25 (1)) గురించి ప్రస్తావిస్తే.. ఇలాంటి మహత్తరమైన ఆల్‌రౌండర్‌ను తాము జీవితంలో చూడలేదని వ్యంగ్యంగా కామెంట్స్‌ చేస్తున్నారు. బ్యాటింగ్‌ చేయడం ఎలాగూ రాదు, బౌలర్‌గా అయినా ఉపయోగపడతాడా అనుకుంటే, జేసన్‌ రాయ్‌ చేతిలో (ఒకే ఓవర్లో 4 సిక్సర్లు) బలైపోయాడని అంటున్నారు.

చదవండి: #JasonRoy: 4 బంతుల్లో నాలుగు సిక్సర్లు.. షాబాజ్‌ అహ్మద్‌ను ఉతికారేశాడు

మొత్తంగా షాబాజ్‌ అహ్మద్‌, దినేశ్‌ కార్తీక్‌ల కారణంగానే ఆర్సీబీ ఓటమిపాలవుతుందని మండిపడుతున్నారు. సొంత మైదానంలో వరుస ఓటములను జీర్ణించుకోలేక ఈ తరహా కామెంట్స్‌ చేస్తున్నారు.  

కాగా, హర్యానాకు చెందిన 29 ఏళ్ల షాబాజ్‌ అహ్మద్‌ను (లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌) 2023 ఐపీఎల్‌ వేలంలో ఆర్సీబీ 2.4 కోట్టు పెట్టి సొంతం చేసుకుంది. 2020 సీజన్‌లో ఐపీఎల్‌ అరంగ్రేటం (ఆర్సీబీ తరఫున, ధర 20 లక్షలు) చేసిన షాబాజ్‌.. ఇప్పటివరకు ఆడిన 37 మ్యాచ్‌ల్లో 321 పరుగులు చేసి 13 వికెట్లు తీశాడు.  

ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీపై కేకేఆర్‌ 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌.. జేసన్‌ రాయ్ (29 బంతుల్లో 56; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) నితీశ్‌ రాణా (21 బంతుల్లో 48), వెంకటేశ్‌ అయ్యర్‌ (26 బంతుల్లో 31) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి ఓటమిపాలైంది.

ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో డుప్లెసిస్‌ (17), మ్యాక్స్‌వెల్‌ (5) సహా‌ అందరూ విఫలమయ్యారు. సిరాజ్‌ (4-0-33-1), హసరంగ (4-0-24-2), విరాట్‌ కోహ్లి (37 బంతుల్లో 54) పర్వాలేదనిపించారు. కేకేఆర్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి 3, సుయాశ్‌ శర్మ, ఆండ్రీ రసెల్‌ తలో 2 వికెట్లు పడగొట్టారు. 

చదవండి: ఫినిషర్‌ పాత్రకు న్యాయం చేయకపోగా పనికిమాలిన రికార్డు
 

మరిన్ని వార్తలు