ICC ODI WC 2023: భారత్‌లో వన్డే వరల్డ్‌కప్‌ కష్టమేనా?.. పాక్‌ కుట్ర అయితే లేదుగా!

17 Dec, 2022 21:45 IST|Sakshi

వచ్చే ఏడాది ప్రతిష్టాత్మక ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ 2023కి భారత్‌ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. పుష్కరకాలం తర్వాత ఈ మెగాటోర్నీకి భారత్‌ మరోసారి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఆసక్తిని సంతరించుకుంది. చివరిగా 2011లో వన్డే వరల్డ్‌కప్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వగా.. ధోని నాయకత్వంలోని టీమిండియా 28 సంవత్సరాల తర్వాత కప్పు గెలిచి చరిత్ర సృష్టించింది.

వన్డే ప్రపంచకప్‌ మరోసారి స్వదేశంలో జరుగుతుండడంతో మ్యాచ్‌లు ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కుతుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అభిమానుల ఆశలు ఆవిరయ్యేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023 ఆతిథ్యం భారత్‌ నుంచి తరలిపోయే అవకాశం ఉంది. భారత ప్రభుత్వానికి పన్నుల చెల్లింపు విషయమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అయితే ఈ ప్రపంచకప్‌ కోసం భారత్‌ ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు పొందాలని ఐసీసీ బీసీసీఐని కోరింది.

మాములుగా ఒక మెగాటోర్నీకి ఆతిథ్యం ఇచ్చే దేశాలు ఆ దేశ ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు పొందాలని గతంలోనే ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయంలో భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి పురోగతి లేదు. దీంతో పన్ను చెల్లింపు విషయంలోతాము ఏమి చేయలేమని.. అవసరమైతే టోర్నమెంట్‌ను భారత్‌లో కాకుండా ఇతర చోట నిర్వహించుకోవచ్చని ఐసీసీకి బీసీసీఐ వివరించినట్లు సమాచారం. అయితే గతంలో 2016లో టి20 ప్రపంచకప్‌ భారత్‌లో జరిగినప్పుడు భారత ప్రభుత్వం ఐసీసీకి పన్ను మినహాంపులు ఇవ్వడానికి నిరాకరించింది. ఈసారి కూడా పన్ను మినహాయింపుకు ప్రభుత్వం ఒప్పుకోకపోతే వన్డే వరల్డ్‌కప్‌ భారత్‌ నుంచి తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

అయితే కొంతమంది అభిమానులు మాత్రం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డును తప్పుబట్టడం ఆసక్తి కలిగించింది. ఆసియా కప్‌ పాకిస్తాన్‌లో నిర్వహిస్తే టోర్నీని బహిష్కరిస్తామని గతంలో టీమిండియా హెచ్చరించింది. దీంతో పీసీబీ టీమిండియాపై అక్కసు వెళ్లగక్కింది. మీరు ఆసియా కప్‌ ఆడేందుకు మా దేశానికి రాకపోతే.. వన్డే వరల్డ్‌కప్‌ ఆడేందుకు తాము రాలేమని.. అవసరమైతే వన్డే వరల్డ్‌కప్‌ను భారత్‌లో జరగకుండా అడ్డుకుంటామని పరోక్షంగా హెచ్చరించింది. పాక్‌ ప్రమేయం ఏం లేనప్పటికి పన్ను మినహాయింపు కారణంగా వన్డే వరల్డ్‌కప్‌ తరలిపోయే అవకాశం ఉండడంతో పాక్‌ ఇలా పంతం నెగ్గించుకుందంటూ కొందరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు