#KLRahul: బిగ్‌షాక్‌.. ఐపీఎల్‌కు కేఎల్‌ రాహుల్‌ దూరం!.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడేది అనుమానమే?

3 May, 2023 18:20 IST|Sakshi
Photo: IPL Twitter

లక్నో సూపర్‌జెయింట్స్‌ జట్టుకు బిగ్‌షాక్‌ తగిలింది. గాయంతో లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఐపీఎల్‌ టోర్నీకి మొత్తానికి దూరం కానున్నట్లు సమాచారం. సోమవారం ఆర్‌సీబీతో మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ ఫీల్డింగ్‌ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. బౌండరీలైన్‌ వద్ద బంతిని ఆపేందుకు పరిగెడుతూ.. మైదానంలో కుప్పకూలాడు. దీంతో తొడ కండరానికి గాయం కావడంతో లేవడానికి ఇబ్బంది పడ్డాడు. ఫిజియోలు వచ్చి స్ట్రెచర్‌పై రాహుల్‌ను తీసుకెళ్లారు. అయితే లక్నో బ్యాటింగ్‌ సమయంలో ఆఖర్లో వచ్చిన రాహుల్‌ పరిగెత్తడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. 

పీటీఐ సమాచారం మేరకు.. ''కేఎల్‌ రాహుల్‌ ప్రస్తుతం లక్నో జట్టుతో ఉన్నప్పటికి సీఎస్‌కేతో మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడు. సీఎస్‌కేతో మ్యాచ్‌ పూర్తవ్వగానే జట్టును వీడనున్న రాహుల్‌ ముంబైకి వెళ్లనున్నాడు. అక్కడ బీసీసీఐ ఆధ్వర్యంలో వైద్యులు స్కానింగ్‌ నిర్వహించనున్నారు. రిపోర్ట్స్‌ ద్వారా వచ్చే ఫలితంపై కేఎల్‌ రాహుల్‌ ఆడతాడా లేదా అనే విషయంపై స్పష్టత రానుంది.

''ఒకవేళ రాహుల్‌ గాయంలో తీవ్రత ఎక్కువగా ఉంటే ఐపీఎల్‌ టోర్నీ మొత్తానికే దూరం కానున్నాడు. ఐపీఎల్‌ తర్వాత జరగనున్న ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడేది కూడా అనుమానమే.కాగా ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌లో గాయపడిన లక్నో బౌలర్‌ జయదేవ్‌ ఉనాద్కట్‌ ప్రస్తుతం ముంబైలో బీసీసీఐ పర్యవేక్షణలోనే ఉన్నాడు.'' అని పేర్కొంది.

లక్నోకు ఎదురుదెబ్బే?
ఈ సీజన్‌ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లిన లక్నో ప్రస్తుతం ఓటములతో సతమతమవుతోంది. ఈ సమయంలో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌తో పాటు ఉనాద్కట్‌ దూరమవ్వడం లక్నోకు ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. ప్రస్తుతం లక్నోకు స్టాండిన్‌ కెప్టెన్‌గా ఉన్న కృనాల్‌ పాండ్యా.. కేఎల్‌ రాహుల్‌ దూరమైతే మిగతా మ్యాచ్‌ల్లోనే అతనే జట్టును నడిపించనున్నాడు.

రాహుల్‌ దూరమైతే డబ్ల్యూటీసీ ఫైనల్‌ అవకాశం ఎవరికి?
ఇక జూన్ 7 నుంచి 11 వరకు జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడేందుకు ఎంపిక చేసిన టీమిండియా జట్టులో రాహుల్‌ సభ్యుడిగా ఉన్నాడు. గాయంతో కేఎల్‌ రాహుల్‌ దూరమైతే అతని స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలన్నది బీసీసీఐ ఆలోచిస్తుంది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం రాహుల్‌ దూరమైతే.. సర్ఫరాజ్‌ ఖాన్‌, ఇషాన్‌  కిషన్‌, హనుమ విహారిలలో ఎవరో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉందని అభిమానులు పేర్కొన్నారు.

చదవండి: 'నా చివరి ఐపీఎల్‌ అని మీరే డిసైడ్‌ అయ్యారా?'

మరిన్ని వార్తలు