టీమిండియాలో అత్యంత ప్రమాదకర‌ ఆటగాడు అతనే..

24 May, 2021 16:22 IST|Sakshi

లండన్‌‌: ప్రస్తుతం టీమిండియాలో అత్యంత ప్రమాదకర ఆటగాడు రిషబ్ పంతేనని, అతనికి అడ్డుకట్ట వేయడం తమ బౌలర్లకు తలకు మించిన పని అవుతుందని న్యూజీలాండ్ బౌలింగ్‌ కోచ్‌ షేన్‌ జుర్గెన్సెన్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో భాగంగా భారత్, న్యూజీలాండ్ జట్లు తలపడనున్న నేపథ్యంలో తమ జట్టు బౌలర్లు పంత్ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించాడు. క్షణాల్లో మ్యాచును మలుపు తిప్పే సామర్థ్యం ఉన్న పంత్ పట్ల తమకు ప్రత్యేక ప్రణాళికలున్నాయని, వాటిని అమలు చేసి పంత్ ను ఖచ్చితంగా కట్టడి చేస్తామని విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.

ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాపై పంత్ ఎదురుదాడికి దిగిన విషయాలపై తాము అధ్యయనం చేసామని వివరించాడు. ఈ సందర్బంగా టీమిండియా బౌలింగ్ అటాక్ పై కూడా ప్రశంశల వర్షం కురిపించాడు. బుమ్రా, షమీ, సిరాజ్‌, ఇషాంత్‌లతో కూడిన టీమిండియా పేస్ దళం అద్భుతంగా ఉందని కొనియాడాడు. కాగా, సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18న భారత్‌, న్యూజీలాండ్ జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే.

ఈ ప్రతిష్టాత్మక పోరులో తలపడేందుకు కేన్ విలియమ్సన్‌ సారథ్యంలోని న్యూజిలాండ్  జట్టు ఇదివరకే ఇంగ్లాండ్‌కు చేరుకుంది. ఈ పర్యటనలో కివీస్ జట్టు టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌కు ముందు ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుతో రెండు టెస్టులు ఆడనుంది.  కాగా, ఇంగ్లండ్ పర్యటన నిమిత్తం  భారత జట్టు జూన్ 2న లండన్ కు బయల్దేరనుంది. ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌తో పాటు ఆతిధ్య జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. 
 

మరిన్ని వార్తలు