Rohit Sharma: మాకు ఎటువంటి స్పెషల్‌ ప్లాన్స్‌ లేవు.. అతడొక ఛాంపియన్‌! జడ్డూ కూడా

5 Nov, 2023 21:43 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే సెమీస్‌ బెర్త్‌ను ఖారారు చేస్తున్న టీమిండియా.. మరో భారీ విజయాన్ని అందుకుంది. ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 243 పరుగుల తేడాతో భారత్‌ చిత్తు చేసింది. 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. భారత బౌలర్ల దాటికి 83 పరుగులకే కుప్పకూలింది. 

భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లతో చెలరేగగా.. షమీ, కుల్దీప్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కోహ్లికి ఇది 49వ సెంచరీ. దీంతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్‌ రికార్డును కోహ్లి సమం చేశాడు. ఇక అద్బుత విజయంపై మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు.

"గత మూడు మ్యాచ్‌ల్లో మేము మెరుగైన ప్రదర్శన చేశాం. ఇంగ్లండ్‌పై ఒత్తిడికి గురయ్యాం. అయినప్పటకీ మాకు ఫైటింగ్‌ స్కోర్‌ వచ్చింది. ఆ తర్వాత మా పేసర్లు తమ పని తము చేసుకుపోయారు. అనంతరం శ్రీలంకపై తొలి ఓవర్‌లోనే వికెట్‌ కోల్పోయాం. కానీ మా బ్యాటర్లు అద్బుతంగా రాణించి ప్రతర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. మళ్లీ సీమర్లు(ఫాస్ట్‌బౌలర్లు) నిప్పులు చేరిగారు. మా ఆఖరి రెండు మ్యాచ్‌ల్లోనూ కోహ్లి చాలా కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు.

అతడి నుంచి మేము అదే ఆశిస్తున్నాం. విరాట్‌ ఒక ఛాంపియన్‌. బ్యాటింగ్‌కు కష్టతరమైన పిచ్‌లపై కూడా విరాట్‌ అద్భుతంగా ఆడాడు. ఇక శ్రేయస్‌ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అయ్యర్‌పై నాకు ఎప్పటికీ నమ్మకం ఉంటుంది. మరోసారి శ్రేయస్‌ తనను తను నిరూపించుకున్నాడు. ఇక షమీ తిరిగి రావడంతో మా బౌలింగ్‌ ఎటాక్‌ మరింత పటిష్టంగా మారింది.

మరోవైపు జడేజా మా జట్టులో ఎంతో కీలకమో మరోసారి రుజువైంది. గత కొన్నేళ్లుగా మూడు ఫార్మాట్లలో అతడు మాకు ఒక మ్యాచ్‌ విన్నర్‌. చివరి ఓవర్లలో కీలకమైన పరుగులు రాబట్టాడు. అంతేకాకుండా బౌలింగ్‌లో కూడా అదరగొట్టాడు. ఇక గిల్‌, నేను ఎప్పుడూ మంచి ఆరంభాన్ని ఇచ్చేందుకే ప్రయత్నిస్తాం. ప్రతీ మ్యాచ్‌కు ముందు మేము ఎటువంటి ప్రణాళికలను సిద్దం చేసుకోము. జట్టులో ప్రతీ ఒక్కరికి వారి పాత్రపై ఒక స్పష్టత ఉందని" రోహిత్‌ శర్మ పోస్ట్‌మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు