WTC Final: రోహిత్‌కు కలిసొచ్చిన ఓవల్‌.. మళ్లీ విజృంభించేనా?

1 Jun, 2023 10:38 IST|Sakshi

మరో వారం రోజుల్లో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య లండన్‌లోని ఓవల్‌ వేదికగా ఐసీసీ వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరగనున్న సంగతి తెలిసిందే. కాగా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు ఇది కీలకంగా మారింది. టీమిండియా తరపున డబ్ల్యూటీసీస టైటిల్‌ సాధించిన తొలి కెప్టెన్‌గా రోహిత్‌ నిలుస్తాడా లేదా అనేది ఒక వారంలో తేలుతుంది. గతంలో కోహ్లికి ఆ అవకాశం వచ్చినప్పటికి 2021 డబ్ల్యూటీసీ ఛాంపియన్‌షిప్‌లో కివీస్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో టీమిండియా పరాజయం పాలైంది.

రోహిత్‌కు కలిసొచ్చిన ఓవల్‌..
అయితే ఈసారి ఎలాగైనా ఫైనల్‌ గెలిచి గదను(డబ్ల్యూటీసీ టైటిల్‌) అందుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. టీమిండియా కూడా అటు బ్యాటింగ్‌.. ఇటు బౌలింగ్‌లో పటిష్టంగానే కనిపిస్తోంది. అయితే మ్యాచ్‌ జరగనున్న ఓవల్‌ మైదానం కెప్టెన్‌ రోహిత్‌కు అచ్చొచ్చింది. ఓవల్‌ వేదికగా 2021లో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో రోహిత్‌ శతకంతో మెరిశాడు. హిట్‌మ్యాన్‌కు విదేశాల్లో ఇదే తొలి శతకం కావడం విశేషం. మరి రోహిత్‌కు అచ్చొచ్చిన ఓవల్‌లో మరోసారి సెంచరీతో చెలరేగి టీమిండియాను గెలిపించి టైటిల్‌ కొట్టాలని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. 

ఇక 2021లో ఓవల్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 157 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 191 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌట్‌ కావడంతో వంద పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్‌(256 బంతుల్లో 127 పరుగులు) సెంచరీకి తోడుగా పుజారా 61, రిషబ్‌ పంత్‌ 50, శార్దూల్‌ ఠాకూర్‌ 60, కోహ్లి 44, రాహుల్‌ 46 పరుగులతో రాణించడంతో టీమిండియా 466 పరుగులకు ఆలౌట్‌ అయింది. 365 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ 210 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఉమేశ్‌ యాదవ్‌ మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.

చదవండి: #SKY: టీ20 మాస్టర్‌క్లాస్‌ చూశాను! నా కళ్ల ముందే.... వారెవ్వా!

సెల్ఫీతో మొదలు.. అభిమానిని పెళ్లాడనున్న టెన్నిస్‌ స్టార్‌

మరిన్ని వార్తలు