Raymond: రూ.8 వేల కోట్లు ఇస్తే భర్తతో విడిపోయేందుకు సిద్ధం

20 Nov, 2023 14:31 IST|Sakshi

రేమండ్ లిమిటెడ్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోదీ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సింఘానియా నికర ఆస్తిలో 75 శాతం(రూ.8200 కోట్లు) తనకు ఇస్తేనే విడిపోయేందుకు అంగీకరిస్తానని నవాజ్ మోదీ తెలిపినట్లు సమాచారం. తనకు నిహారిక, నిసా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, వారి భవిష్యత్తు కోసం ఆ డబ్బు అవసరం అవుతుందని నవాజ్ మోదీ చెప్పినట్లు తెలిసింది.

అయితే ఆమె డిమాండ్‌కు గౌతమ్‌ సింఘానియా దాదాపు అంగీకరించినట్లు సమాచారం. అతను ఫ్యామిలీ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.  కుటుంబ ఆస్తులను ట్రస్ట్‌కు బదిలీ చేయాలని, దానికి ఒకరే మేనేజింగ్ ట్రస్టీగా ఉండాలని సూచించారు. సింఘానియా మరణించిన తర్వాత తన కుటుంబ సభ్యులకే ఆ ఆస్తులు చేరేలా ఏర్పాటు చేయాలని కోరినట్లు కొన్ని వార్తాకథనాలు ద్వారా తెలిసింది. అయితే ఈ తంతు నవాజ్‌మోదీకి ఇష్టం లేదు. 

ఖైతాన్ అండ్‌ కో సంస్థకు చెందిన హైగ్రేవ్ ఖైతాన్ గౌతమ్ సింఘానియాకు, ముంబయికు చెందిన న్యాయవాది రష్మీ కాంత్ నవాజ్ మోదీలకు న్యాయ సలహాదారులుగా ఉన్నారు. ‘32 ఏళ్లు జంటగా కలిసి, తల్లిదండ్రులుగా బాధ్యతలు నిర్వర్తించాం. ఇన్నేళ్లు చాలా విశ్వాసంతో గడిపాం. మా జీవితాల్లో కొన్ని మార్పులు వచ్చాయి. దాంతో నిరాధారమైన పుకార్లు, గాసిప్‌లు చక్కర్లు కొట్టాయి. కొన్ని కారణాల వల్ల నేను ఆమె(నవాజ్‌మోదీ)తో విడిపోతున్నాను’అని గౌతమ్‌ సింఘానియా గతంలో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వెల్లడించారు.

నవాజ్ మోదీ దక్షిణ ముంబైలో ఏరోబిక్స్, వెల్‌నెట్‌ నిపుణులుగా పని చేస్తున్నారు. దాంతోపాటు బాడీ ఆర్ట్, ఫిట్‌నెస్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. రూ.11,875.42 కోట్ల విలువైన రేమండ్ లిమిటెడ్ బోర్డులో తను సభ్యురాలుగా ఉన్నారు.

మరిన్ని వార్తలు