'ద్రవిడ్‌ భయ్యా.. ఎవరీ కుర్రాడు కుమ్మేస్తున్నాడు'

10 Mar, 2021 12:06 IST|Sakshi

అహ్మదాబాద్‌: టీమిండియా యంగ్‌ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌ లిస్టులో ఉన్నాడు. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ నుంచి భీకరఫామ్‌లో ఉన్న పంత్‌ ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేశాడు. ముఖ్యంగా అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన చివరి టెస్టులో తీవ్ర ఒత్తిడిలో అద్భుత సెంచరీతో( 101 పరుగులు) మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా ఇంగ్లండ్‌తో 5 టీ20ల సిరీస్‌కు సిద్ధమవుతున్న పంత్‌ మరో నెలరోజుల వ్యవధిలో ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఆడనున్నాడు. ఆరంభం నుంచి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌( ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌)కు ప్రాతినిధ్యం వహిస్తున్న రిషబ్‌ పంత్‌ 68 మ్యాచ్‌ల్లో 2వేల పరుగులు సాధించాడు.

తాజాగా ఇంగ్లండ్‌ టీ20 స్టార్‌ సామ్‌ బిల్లింగ్స్‌ పంత్‌తో తనకు జరిగిన మొదటి పరిచయాన్ని ఈఎస్‌పీఎన్‌ ఇంటర్య్వూలో మరోసారి గుర్తుచేసుకున్నాడు.''నేను పంత్‌ను మొదటిసారి చూసింది 2016 ఐపీఎల్‌లో అనుకుంటా. ఇద్దరం కలిసి రెండేళ్లు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాము. అండర్‌ 19 ప్రపంచకప్‌లో రన్నరఫ్‌గా నిలిచిన టీమిండియా జట్టులో సభ్యుడిగా ఉన్న పంత్‌ అదే దూకుడుతో అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఎంపికయ్యాడు. నెట్‌ ప్రాక్టీస్‌ సమయంలో మా బౌలర్లు నాథర్‌ కౌల్టర్‌నీల్‌, క్రిస్‌ మోరిస్‌, కగిసో రబడ ఇలా ఎవరు బౌలింగ్‌ వేసినా కుమ్మేస్తున్నాడు. దీంతో అప్పటి మెంటార్‌ రాహుల్‌ ద్రవిడ్‌వైపు తిరిగి.. ఎవరీ కుర్రాడు.. కుమ్మేస్తున్నాడు'' అని అడిగాను.
 
అయితే ఇదే బిల్లింగ్స్‌ 2017లో ధోని స్థానాన్ని ఆక్రమించే అర్హత పంత్‌కు మాత్రమే ఉందని చెప్పడం అప్పట‍్లో విమర్శలకు దారి తీసింది. కాగా 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సామ్‌ బిల్లింగ్స్‌ ఇంగ్లండ్‌ తరపున  21 వన్డేల్లో 586 పరుగులు, 30 టీ20ల్లో 391 పరుగులు చేశాడు.  టీ20 స్టార్‌గా మారిన బిల్లింగ్స్‌ కెరీర్‌లో 2020 సంవత్సరం చెప్పుకోదగ్గది. కరోనాతో మ్యాచ్‌లు జరగకపోయినా.. ఇటు ఇంగ్లండ్‌ తరపున.. ఆ తర్వాత బిగ్‌బాష్‌ లీగ్‌లో సిడ్నీ థండర్స్‌ తరపున మెరుపులు మెరిపించాడు. తాజాగా ఫిబ్రవరిలో జరిగిన వేలంలో రూ.2 కోట్లకు తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది. కాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఏప్రిల్‌ 9 నుంచి మే 30 వరకు జరగనుంది.
చదవండి:
యువీని ఉతికారేసిన కెవిన్‌ పీటర్సన్‌.. 

పాంటింగ్‌ ట్వీట్‌కు పంత్‌ అదిరిపోయే రిప్లై

మరిన్ని వార్తలు