WC 2023: అర్థం చేసుకునే వాళ్లకు ఒక్క సైగ చాలు.. ఇంతకంటే: ధోని కామెంట్స్‌ వైరల్‌

27 Oct, 2023 12:16 IST|Sakshi

ICC WC 2023- MS Dhoni Comments: టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనత మహేంద్ర సింగ్‌ ధోని సొంతం. టీ20 ఫార్మాట్లో 2007లో తొలిసారిగా ప్రవేశపెట్టిన వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలచిన ఈ మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌.. 2011లో భారత్‌కు రెండో వన్డే ప్రపంచకప్‌ అందించాడు.

ఆ తర్వాత మళ్లీ చాంపియన్స్‌ ట్రోఫీ రూపంలో 2013లో మరోసారి ప్రతిష్టాత్మక టైటిల్‌ సాధించాడు. ధోని శకం ముగిసిన తర్వాత టీమిండియా మళ్లీ ఇంత వరకు ఐసీసీ టోర్నీ గెలిచిన సందర్భాలు లేవు.

పదేళ్ల తర్వాత
అయితే, పదేళ్ల తర్వాత సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌-2023 రూపంలో మరోసారి టైటిల్‌ గెలిచే అవకాశం ముంగిట నిలిచింది భారత్‌. ట్రోఫీ గెలిచే దిశగా ఇప్పటికే అద్భుతమైన విజయాలతో రోహిత్‌ శర్మ సారథ్యంలోని జట్టు ముందుకు సాగుతోంది.

వరుసగా ఐదు విజయాలతో అజేయంగా
పూర్తి సమతూకంగా కనిపిస్తున్న భారత జట్టు ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఐదూ గెలిచి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. తొలుత ఆస్ట్రేలియాను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. ఆ తర్వాతి మ్యాచ్‌లలో అఫ్గనిస్తాన్‌(8 వికెట్లు), పాకిస్తాన్‌(7 వికెట్లు), బంగ్లాదేశ్‌(7 వికెట్లు), న్యూజిలాండ్‌(4 వికెట్లు)పై వరుస విజయాలు సాధించింది.

అన్నీ మంచి శకునములే
ఈ నేపథ్యంలో హాట్‌ ఫేవవరెట్‌గా బరిలోకి దిగిన రోహిత్‌ సేన ఈసారి కప్పు కొట్టడం ఖాయమనే అభిప్రాయాలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఐసీసీ టైటిళ్ల ధీరుడు, మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి ఈ విషయం గురించి ప్రశ్న ఎదురైంది.

ఇందుకు బదులుగా.. ‘‘ఈ జట్టు చాలా బాగుంది. సమతూకంగా కనిపిస్తోంది. ప్రతి ఒక్క ఆటగాడు తమ పని తాము సమర్థవంతంగా పూర్తి చేస్తున్నారు. అన్నీ మంచి శకునాలే ఎదురవుతున్నాయి.

ఒక్క సైగ చాలు
ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్పలేను. అర్థం చేసుకునేవాళ్లకు ఒక్క సైగ చాలు కదా!’’ అంటూ టీమిండియా ఈసారి ట్రోఫీని ముద్దాడుతుందని చెప్పకనే చెప్పాడు ధోని. ఈ మేరకు ధోని చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా అక్టోబరు 29న ఇంగ్లండ్‌తో తమ తదుపరి మ్యాచ్‌ ఆడనుంది.

చదవండి: WC 2023: పొరపాటు చేయలేదు.. మా ఓటమికి కారణాలివే! అయినా..: బట్లర్‌ 
WC 2023: ఎవరు ఏం చెప్పినా వినాలి.. కెప్టెన్‌గా నేనున్నాంటే: రోహిత్‌ శర్మ 

మరిన్ని వార్తలు