Sania Mirza: టెన్నిస్‌కు సానియా మీర్జా గుడ్‌బై.. భావోద్వేగ పోస్ట్‌

14 Jan, 2023 01:31 IST|Sakshi

మెల్‌బోర్న్‌: భారత వెటరన్‌ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఫిబ్రవరిలో జరిగే దుబాయ్‌ ఓపెన్‌ తర్వాత రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో భావోద్వేగపు లేఖను ‘లైఫ్‌ అప్‌డేట్‌’ అనే క్యాప్షన్‌తో పంచుకుంది. మూడు పేజీల ఈ లేఖలో తన 30 ఏళ్ల రాకెట్‌ పయనాన్ని, చివరి గమ్యాన్ని వివరించింది.

‘నా గ్రాండ్‌స్లామ్‌ ప్రయాణం 2005లో ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌తోనే మొదలైంది. ఇప్పుడు గ్రాండ్‌స్లామ్‌ ఆట కూడా అక్కడే ముగించేందుకు సరైన వేదిక అనుకుంటున్నా. 18 ఏళ్ల క్రితం ఎక్కడైతే ఆరంభించానో అక్కడే ఆపేయబోతున్నా. ఇక కెరీర్‌లో చివరి టోర్నీ మాత్రం దుబాయ్‌ ఓపెన్‌. ఫిబ్రవరిలో ఈ టోరీ్నతో సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతాను. ఇన్నేళ్ల పయనంలో ఎన్నో ఆటుపోట్లే కాదు మరెన్నో మధురస్మృతులూ ఉన్నాయి’ అని అందులో పేర్కొంది.

నాసర్‌ స్కూల్‌కు చెందిన ఆరేళ్ల బాలిక ఎలా టెన్నిస్‌ నేర్చుకుంది... తన కలలకు ఎక్కడ బీజం పడింది... అన్నింటికీ మించి దేశానికి ప్రాతినిధ్యం ఎలాంటి స్ఫూర్తినిచ్చిందో ఆ లేఖలో చెప్పుకొచ్చింది. అర్ధ సెంచరీని దాటిన తన గ్రాండ్‌స్లామ్‌ టోరీ్నల్లో గెలిచిన కొన్ని టైటిళ్లు దేవుడిచ్చిన వరమంది. ‘నా సుదీర్ఘ కెరీర్‌లో దేశానికి పతకాలు తేవడమే అతిపెద్ద గౌరవంగా భావిస్తాను. పతకం నా మెడలో పడినపుడు జాతీయ పతాకం రెపరెపలాడినపుడు కలిగే ఆనందం అన్నింటికి మించి ఉంటుంది. ఇప్పుడు దీన్ని తలచుకొని రిటైర్మెంట్‌ సందేశం రాస్తున్నప్పుడు చెరిగిపోని ఆ అనుభూతి నా కళ్లను చెమరుస్తోంది’ అని 36 ఏళ్ల సానియా పేర్కొంది.   

ఇదిలా ఉంటే, మహిళల డబుల్స్‌లో మాజీ నెంబర్‌ వన్‌ అయిన 36 ఏళ్ల  సానియా మీర్జా.. డబుల్స్‌ విభాగంలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌ టైటిళ్లను, అలాగే మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌, యూఎస్‌ ఓపెన్‌ టైటిల్స్‌ను గెలిచింది. 2016 రియో ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సెమీఫైనల్లో ఓడిన సానియా జంట తృటిలో పతకం చేజార్చుకుంది.

మరిన్ని వార్తలు