మ్యాక్సీని కొనుగోలు చేస్తే మూల్యం చెల్లించుకున్నట్లే

26 Jan, 2021 15:54 IST|Sakshi

ముంబై : ఐపీఎల్‌ 2021కి సంబంధించి మినీ వేలానికి సన్నద్ధమవుతున్న ఫ్రాంచైజీలు ఇప్పటికే రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్ల జాబితాతో పాటు రిలీజ్‌ చేసిన ఆటగాళ్ల లిస్టును ప్రకటించాయి. కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ కూడా తమ రిటైన్‌, రిలీజ్‌ ఆటగాళ్లను ప్రకటించింది. కింగ్స్‌ ప్రకటించిన రిలీజ్‌ జాబితాలో ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

గత సీజన్‌లో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ తరపున 13 మ్యాచులాడిన మ్యాక్స్‌వెల్‌ కేవలం 108 పరుగులు మాత్రమే చేసి దారుణ ప్రదర్శన కనబరిచాడు. మ్యాక్స్‌వెల్‌ వరుసగా విఫలమవుతున్న వేళ మేనేజ్‌మెంట్‌ అతనిపై నమ్మకముంచి అవకాశాలు కల్పించినా తన ఆటతీరులో ఏ మాత్రం మార్పు లేదు. దీనికి తోడు మ్యాక్సీ ప్రదర్శనపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. 2019 డిసెంబర్‌లో జరిగిన మినీ వేలంలో కింగ్స్‌ పంజాబ్‌ రూ. 10.5 కోట్లు పెట్టి మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: పంత్‌ నిరాశకు లోనయ్యాడు

 తాజాగా కివీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ స్కాట్‌ స్టైరిస్‌ మ్యాక్స్‌వెల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో స్టైరిస్‌ మాట్లాడుతూ.. 'మాక్స్‌వెల్‌కు ఈసారి జరగబోయే ఐపీఎల్‌ వేలంలో ఆశించినంత ధర రాకపోవచ్చు... కానీ రాణించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ప్రశ్నకు నా సమాధానాన్ని ఒక్క జవాబుతో చెప్పాలనుకుంటున్నా.. ఏ ఆటగాడైనా సరే వేలంలో 10 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడుపోతే.. వాళ్ల తలలకు కొమ్ములు వస్తాయి.. మ్యాక్సీ విషయంలో ఇప్పటికే నిరుపితమైంది. ఒక ఆటగాడి ప్రదర్శనకు వేలంలో ఎక్కువ ధర ఇస్తే బాగుంటుంది.. కానీ అతని అంతర్జాతీయ ఆటతీరు చూసి మాత్రం తీసుకోవద్దని నా సలహా.

ఈ విషయం ఫ్రాంచైజీలు తెలుసుకుంటే రానున్న వేలంలో మ్యాక్స్‌వెల్‌ను కనీస మద్దుత ధరకే ఎక్కువ అమ్ముడుపోయే అవకాశాలు ఉంటాయి. నాకు తెలిసి మ్యాక్స్‌వెల్‌ ఏనాడు ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన కనబరచలేదు. గత ఐదారేళ్లుగా మ్యాక్సీ ఐపీఎల్‌ ఆడుతున్నా.. 2014 మినహా ఏనాడు చెప్పుకోదగ్గ విధంగా రాణించలేదు. ఒకవేళ ఏ జట్టైనా అతన్ని కొనుగోలు చేసినా .. మ్యాక్సీ మంచి ప్రదర్శన చేయకపోతే ఆయా జట్టు మేనేజ్‌మెంట్‌ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.' అంటూ అభిప్రాయపడ్డాడు. చదవండి: ‘బాగా ఆడింది వారైతే నాకెందుకు ఆ క్రెడిట్‌‌’

మరిన్ని వార్తలు