టైటిల్‌ వేటకు సై

10 Aug, 2020 02:16 IST|Sakshi

యూఎస్‌ ఓపెన్‌కు సెరెనా సిద్ధం

నేడు మొదలయ్యే కెంటకీ ఓపెన్‌తో పునరాగమనం

కరోనా మహమ్మారితో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లో పలువురు అగ్రశ్రేణి టెన్నిస్‌ క్రీడాకారులు అనవసరమైన రిస్క్‌ తీసుకోకూడదనే ఉద్దేశంతో యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీకి డుమ్మా కొడుతున్నారు. ఇతరుల సంగతి అటుంచితే... సొంత దేశంలో జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో తాను పాల్గొంటానని... వెనకడుగు వేసేది లేదని అమెరికా టెన్నిస్‌ సూపర్‌స్టార్‌ సెరెనా విలియమ్స్‌ స్పష్టం చేసింది. ఇప్పటికే ఇంట్లో నిర్మించుకున్న సొంత టెన్నిస్‌ కోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించినట్లు... ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్న జిమ్‌లో కసరత్తులు కొనసాగిస్తున్నట్లు సెరెనా తెలిపింది.

న్యూయార్క్‌: టెన్నిస్‌ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ గెలిచిన క్రీడాకారిణిగా మార్గరెట్‌ కోర్ట్‌ (24 టైటిల్స్‌–ఆస్ట్రేలియా) పేరిట ఉన్న రికార్డును సమం చేయడానికి అమెరికా స్టార్‌ ప్లేయర్‌ సెరెనా విలియమ్స్‌ మరో టైటిల్‌ దూరంలో ఉంది. 23 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిళ్ల చాంపియన్‌ సెరెనాకు నాలుగుసార్లు (2018 వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌; 2019 వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌) ఈ రికార్డును సమం చేయడానికి అవకాశం వచ్చింది.

కానీ ఆమె తుది పోరులో తడబడి ఓటమిపాలై ఆల్‌టైమ్‌ రికార్డుకు ఇంకా దూరంలోనే ఉంది. ఈ ఏడాది ఆ రికార్డును అందుకోవడానికి సెరెనా ముందు మరో రెండు అవకాశాలు ఉన్నాయి. ఈనెల 31న మొదలయ్యే యూఎస్‌ ఓపెన్‌... ఆ తర్వాత సెప్టెంబర్‌ 27న మొదలయ్యే ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీలలో సెరెనా ఆడనుంది. అయితే ఈ రెండు టోర్నీలకంటే ముందు నేటి నుంచి లెక్సింగ్టన్‌లో ప్రారంభమయ్యే కెంటకీ ఓపెన్‌తో సెరెనా పునరాగమనం చేయనుంది. ఈ నేపథ్యంలో సెరెనా ఏమి చెప్పిందో... ఆమె మాటల్లోనే.... 

ఇన్నాళ్లూ... ఇంట్లోనే! 
కరోనా మహమ్మారి బారిన పడకుండా గత ఆరు నెలలుగా నేను ఫ్లోరిడాలోని ఇంట్లోనే గడిపాను. ఒకవేళ బయటకు వెళ్లాల్సిన అవసరం వస్తే తప్పనిసరిగా మాస్క్‌లు ధరించే వెళ్లాను. నా వద్ద దాదాపు 50 మాస్క్‌లు ఉన్నాయి. మార్చి నుంచే భౌతిక దూరం పాటిస్తున్నాను. నేను గతంలో ఊపిరితిత్తుల సమస్యలతో బాధ పడ్డాను. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే చాలా జాగ్రత్తలు పాటిస్తూ సమయాన్ని గడుపుతున్నాను.  

భవిష్యత్‌ ప్రణాళికలు లేకుండానే... 
కరోనా కాలంలో నేను ఎలాంటి ముందస్తు ప్రణాళికలు వేసుకోవడం లేదు. ఎందుకంటే పలు టోర్నీలు రద్ద్దవుతున్నాయి. ఏ రోజుకారోజు ఏం జరుగుతుందోనని ఆలోచిస్తూ గడుపుతున్నాను. వచ్చే నెలలో 39 ఏళ్లు నిండబోతున్నాయి. వచ్చే సంవత్సరం జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో ఆడేది లేనిది ఇప్పుడే చెప్పలేను. అసలు టోక్యోలో వచ్చే ఏడాదైనా ఒలింపిక్స్‌ జరుగుతాయో లేదో నాకైతే సందేహంగా ఉంది.  

మా ఆయన ‘కోర్టు’ కట్టించాడు... 
కరోనా సమయంలో బయటకు వెళ్లి ప్రాక్టీస్‌ చేసే అవకాశం లేకపోవడంతో ఇంట్లోనే సొంత కోర్టు, వ్యక్తిగత జిమ్‌ ఏర్పాటు చేసుకున్నాను. ఇంట్లోనే టెన్నిస్‌ ప్రాక్టీస్‌ చేసుకునేందుకు వీలుగా నా భర్త నా కోసం ప్రత్యేకంగా టెన్నిస్‌ ‘కోర్టు’ కట్టించి ఇచ్చాడు. శారీరకంగా ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా ఉన్నా. అయితే మ్యాచ్‌ ఫిట్‌నెస్‌... శారీరక ఫిట్‌నెస్‌ వేరు. కరోనా సమయంలో ఒకటి తెలిసొచ్చింది. భవిష్యత్‌ గురించి ఎలాంటి  ప్రణాళికలు చేసుకోరాదు. ఏ రోజుకారోజును సంతోషంగా గడిపేయాలి.

>
మరిన్ని వార్తలు