New ICC Chairman: ఐసీసీ చైర్మన్‌గా గంగూలీ ఎంపిక ఖరారు..?

27 Jul, 2022 15:19 IST|Sakshi

Sourav Ganguly: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ) తదుపరి చైర్మన్‌గా బీసీసీఐ బాస్‌ సౌరవ్‌ గంగూలీ ఎంపిక దాదాపుగా ఖరారైందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ స్పోర్ట్స్‌ మ్యాగజైన్‌ స్పోర్ట్‌స్టార్‌ ఓ కథనంలో ప్రస్తావించింది. ఐసీసీ చైర్మన్‌ పదవి కోసం తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ దాదా ఎంపిక లాంఛనమేనని స్పోర్ట్‌స్టార్‌ విశ్లేషించింది.

రేసులో బీసీసీఐ కార్యదర్శి జై షా, కేంద్ర క్రీడల మంత్రి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఆనురాగ్‌ ఠాకూర్‌ పేర్లు ప్రముఖంగా వినిపించినా అవన్నీ పుకార్లేనని కొట్టిపారేసింది. అయితే ఈ విషయంపై స్పందించేందుకు బీసీసీఐ వర్గాలు నిరాకరించాయి. అధ్యక్ష ఎన్నికకు సమయం చాలా ఉందని, ఇప్పటి నుంచే ఆ అంశంపై డిస్కషన్‌ ఎందుకని బీసీసీఐకి చెందిన ఓ కీలక వ్యక్తి అన్నారు. 

కాగా, ప్రస్తుత ఐసీసీ చైర్మన్‌ గ్రెగ్‌ బార్ల్కే (న్యూజిలాండ్‌) పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుండడంతో ఆ పదవి ఎవరిని వరిస్తుందోనని క్రికెట్‌ వార్గలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఐసీసీ చైర్మన్లుగా గతంలో నలుగురు భారతీయులు పని చేసిన సంగతి తెలిసిందే. తొలుత బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త జగ్మోహన్ దాల్మియా, ఆతరువాత మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్, చెన్నై సూపర్ కింగ్స్ అధినేత శ్రీనివాసన్, సీనియర్ న్యాయవాది శశాంక్ మనోహర్‌ ఐసీసీ చైర్మన్‌ హోదాలో పని చేశారు.

ఇదిలా ఉంటే, టీమిండియా మాజీ క్రికెటర్‌, ఎన్‌సీఏ హెడ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌కు ఐసీసీలో కీలక పదవి దక్కింది. మెన్స్‌ క్రికెట్‌ కమిటీలో భాగంగా ఆటగాళ్ల ప్రతినిధిగా ఎంపిక చేసినట్లు ఐసీసీ మంగళవారం (జులై 26) ప్రకటించింది. లక్ష్మణ్‌తో పాటు న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ డేనియల్‌ వెటోరిని కూడా ప్రతినిధిగా ఎంపిక చేసినట్లు బర్మింగ్‌హమ్‌ వేదికగా జరిగిన వార్షిక సమావేశంలో ఐసీసీ వెల్లడించింది.
చదవండి: ఐసీసీలో వివిఎస్‌ లక్ష్మణ్‌కు కీలక పదవి
 

మరిన్ని వార్తలు