సఫారీ... రికార్డుల సవారీ

8 Oct, 2023 04:07 IST|Sakshi

428 పరుగులతో చెలరేగిన దక్షిణాఫ్రికా

డసెన్, మార్క్‌రమ్, డి కాక్‌ సెంచరీలు

102 పరుగులతో శ్రీలంకపై విజయం  

న్యూఢిల్లీ: ప్రపంచకప్‌ తొలి మూడు మ్యాచ్‌లలో అంతంతమాత్రం ప్రదర్శనతో నిరాశ చెందిన అభిమానులకు నాలుగో మ్యాచ్‌ అసలైన వినోదాన్ని అందించింది. దక్షిణాఫ్రికా, శ్రీలంక మధ్య ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో జరిగిన పోరు కొత్త రికార్డులకు వేదికగా నిలిచింది. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయిన దక్షిణాఫ్రికా అసాధారణ స్కోరు సాధిస్తే... ఓటమి ఎదురైనా పూర్తిగా చేతులెత్తేయకుండా లంక కూడా ఆఖరి వరకు పోరాడింది.

చివరకు 102 పరుగుల తేడాతో విజయం దక్షిణాఫ్రికా సొంతమైంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు సాధించింది. వాన్‌ డర్‌ డసెన్‌ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), క్వింటన్‌ డి కాక్‌ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకాలతో చెలరేగారు.

అనంతరం శ్రీలంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. చరిత్‌ అసలంక (65 బంతుల్లో 79; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), కుశాల్‌ మెండిస్‌ (42 బంతుల్లో 76; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), దసున్‌ షనక (62 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. 

428/5 వరల్డ్‌ కప్‌లో ఒక జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఇదే. ఓవరాల్‌గా వన్డేల్లో 9వ అత్యధిక స్కోరు.  

1 ప్రపంచకప్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ముగ్గురు సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి. ఓవరాల్‌గా వన్డేల్లో ఇది నాలుగో సారి. ఇందులో మూడు దక్షిణాఫ్రికావే.  

49 బంతులు మార్క్‌రమ్‌ ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేసి గతంలో కెవిన్‌ ఓబ్రైన్‌ (50 బంతులు) పేరిట ఉన్న రికార్డును సవరించాడు.   

మరిన్ని వార్తలు