Sports Authority of India: మహిళా జట్లకు మహిళా కోచ్‌ తప్పనిసరి

16 Jun, 2022 07:43 IST|Sakshi

న్యూఢిల్లీ: క్రీడాకారిణిలకు తరచూ ఎదురవుతోన్న కోచ్‌ల వేధింపులకు ముగింపు పలకాలని భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకపై మహిళల జట్లు ఆడేందుకు ఎక్కడికి వెళ్లినా మహిళా కోచ్‌ను తప్పనిసరిగా నియమించాలని జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్‌)లను ఆదేశించింది. దేశవాళీ టోర్నీ, విదేశీ పర్యటనలకు వెళ్లే అమ్మాయిల బృందంలో మహిళా కోచ్‌ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఇటీవల స్లోవేనియాలో జరిగిన పోటీలకు వెళ్లిన మహిళా సైక్లిస్ట్‌ పట్ల చీఫ్‌ కోచ్‌ ఆర్‌.కె.శర్మ అనుచితంగా ప్రవర్తించాడు.

ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయగా, ‘సాయ్‌’ అతన్ని పదవి నుంచి తప్పించి, విచారణ చేపట్టింది. మరో మహిళా సెయిలర్‌కు జర్మనీలో ఇలాంటి అనుభవమే ఎదురవడంతో ‘సాయ్‌’ డైరెక్టర్‌ జనరల్‌ సందీప్‌ ప్రధాన్‌ 15 ఎన్‌ఎస్‌ఎఫ్‌లకు చెందిన అధికారులతో సమావేశమయ్యారు. ‘సాయ్‌’ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించేలా ఓ ప్రత్యేక అధికారిని జట్టులో నియమించాలని కూడా ఆయన ఆదేశించారు.
చదవండి: FIFA U17 Womens World Cup 2022: ఫిఫా వరల్డ్‌ కప్‌ 2022 షెడ్యూల్‌ విడుదల

మరిన్ని వార్తలు