IPL Auction: 'అతడి కోసం ఎస్‌ఆర్‌హెచ్‌ రికార్డులు బ్రేక్‌ చేస్తోంది'

7 Dec, 2023 20:21 IST|Sakshi

ఐపీఎల్‌-2024 మినీ వేలానికి సమయం దగ్గరపడుతోంది. డిసెంబర్‌ 19న దుబాయ్‌ వేదికగా ఈ క్యాష్‌రిచ్‌ లీగ్‌ వేలం జరగనుంది. వన్డే వరల్డ్‌కప్‌-2023లో అదరగొట్టిన  ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకోవడంతో.. ఈసారి వేలం మరింత రసవత్తరంగా జరగనుంది. న్యూజిలాండ్‌ యువ సంచలనం రచిన్‌ రవీంద్ర, ఆసీస్‌ స్టార్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌, మిచెల్‌ స్టార్క్‌ వంటి వరల్డ్‌కప్‌ హీరోలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

దీంతో వేలంలో అనుసరల్సిన వ్యూహాలపై ఆయా ఫ్రాంచైజీలు కసరత్తలు మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీని ఉద్దేశించి భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వేలంలో రచిన్ రవీంద్ర కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ మొత్తాన్ని వెచ్చించేందుకు సిద్దంగా ఉందని పఠాన్‌ జోస్యం చెప్పాడు.

కాగా వన్డే ప్రపంచకప్‌లో రచిన్‌ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా టోర్నీలో రవీంద్ర 578 పరుగులు చేసి న్యూజిలాండ్‌ తరపున టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌ పరంగా ఈ యువ ఆల్‌రౌండర్‌ పర్వాలేదన్పించాడు.

"ప్రస్తుతం సన్‌రైజర్స్‌ జట్టులో వికెట్లు తీయగల సత్తా ఉన్న సరైన స్పిన్నర్‌ లేడు. గత సీజన్‌లో ఆదిల్ రషీద్ జట్టులో ఉండేవాడు. కానీ ఈసారి అతడిని ఎస్‌ఆర్‌హెచ్‌ రిటైన్‌ చేసుకోలేదు. దీంతో జట్టులో ఇప్పుడు మయాంక్‌ మార్కండే ఒక్కడే రెగ్యూలర్‌ స్పిన్నర్‌ ఉన్నాడు. కానీ  అతడి కంటే మెరుగ్గా బౌలింగ్‌ చేయగలిగే బౌలర్ అవసరం.

వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్‌ వంటి ఆల్‌రౌండర్ల ఉన్నప్పటికీ  రచిన్‌ను తీసుకుంటే ఆ విభాగం మరింత బలోపేతం అవుతుంది. వరల్డ్‌కప్‌లో రచిన్‌ ఓపెనర్‌గా కూడా అద్భుతంగా రాణించాడు. గత రెం‍డు మూడు సీజన్ల నుంచి ఎస్‌ఆర్‌హెచ్‌కు ఓపెనింగ్‌ సమస్య కూడా ఉంది.  కాబట్టి ఈసారి వేలంలో రచిన్‌ రవీంద్ర కోసం ఎస్‌ఆర్‌హెచ్‌ తీవ్రంగా పోటీ పడుతుంది" అని స్టార్‌స్పోర్ట్స్‌ షోలో ఇర్ఫాన్‌ పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ పర్స్‌లో రూ. 34 కోట్లు మిగిలి ఉన్నాయి.
చదవండి: T20 WC 2024: టీ20 వరల్డ్‌కప్‌కు కోహ్లి దూరం.. విధ్వంసకర ఆటగాడికి ఛాన్స్‌!?

>
మరిన్ని వార్తలు