SL VS IRE 1st Test: చరిత్ర సృష్టించిన శ్రీలంక.. అతి భారీ విజయం

18 Apr, 2023 16:24 IST|Sakshi

స్వదేశంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక ఇన్నింగ్స్‌ 280 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో శ్రీలంకకు ఇదే అతి భారీ విజయం. 2004లో జింబాబ్వేపై ఇన్నింగ్స్‌ 254 పరుగుల తేడాతో సాధించిన విజయమే ఈ మ్యాచ్‌కు ముందు వరకు శ్రీలంకకు అతి భారీ విజయంగా ఉండింది. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో అతి భారీ విజయం​ రికార్డు ఇంగ్లండ్‌ పేరిట ఉంది. 1938లో ఇంగ్లండ్‌.. ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్‌ 579 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. కేవలం 3 రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి పసికూనపై చారిత్రక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. తొలి ఇన్నింగ్స్‌ను 591/6 స్కోర్‌ వద్ద డిక్లేర్‌ చేసింది. కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే (179), కుశాల్‌ మెండిస్‌ (140), దినేశ్‌ చండీమాల్‌ (102 నాటౌట్‌), సమరవిక్రమ (104 నాటౌట్‌) సెంచరీలతో కదం తొక్కారు.

అనంతరం ప్రభాత్‌ జయసూర్య విజృంభించడంతో ఐర్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఫాలోఆన్‌ ఆడిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శన చేసి 168 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో జయసూర్య 3 వికెట్లు పడగొట్టగా.. రమేశ్‌ మెండిస్‌ 4, విశ్వ ఫెర్నాండో 2 వికెట్లు దక్కించుకున్నారు. 2 మ్యాచ్‌ల ఈ టెస్ట్‌ సిరీస్‌లో రెండో టెస్ట్‌ ఏప్రిల్‌ 24 నుంచి ఇదే వేదికగా జరుగుతుంది.  

జయసూర్యకు 10.. 6 మ్యాచ్‌ల్లో 5 సార్లు 5 వికెట్లు, 2 సార్లు 10 వికెట్లు
తొలి ఇన్నింగ్స్‌లో 7, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టిన ప్రభాత్‌ జయసూర్య.. తన 6 మ్యాచ్‌ల టెస్ట్‌ కెరీర్‌లో రెండోసారి 10 వికెట్లు పడగొట్టాడు. 6 మ్యాచ్‌ల్లో మొత్తం 43 వికెట్లు సాధించిన జయసూర్య.. ఐదు సార్లు 5 వికెట్ల ఘనత కూడా సాధించాడు.

రమేశ్‌ మెండిస్‌ రికార్డు.. 
ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో తొలి ఇ‍న్నింగ్స్‌లో ఒకటి, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన రమేశ్‌ మెండిస్‌.. శ్రీలంక తరఫున అత్యంత వేగంగా 50 వికెట్లు (మ్యాచ్‌లు (11), ఇన్నింగ్స్‌ (21) పరంగా) పడగొట్టిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.  
 

మరిన్ని వార్తలు