T20 Blast: జోస్‌ బట్లర్‌ వీరవిహారం.. శివాలెత్తిన సామ్‌ కర్రన్‌ 

8 Jun, 2023 10:38 IST|Sakshi

టీ20 బ్లాస్ట్‌లో భాగంగా నిన్న (జూన్‌ 7) జరిగిన వివిధ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ క్రికెటర్లు పేట్రేగిపోయారు. వార్సెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో లాంకాషైర్‌కు ప్రాతినిధ్యం వహించిన జోస్‌ బట్లర్‌ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారం చేయగా.. గ్లామోర్గన్‌పై ససెక్స్‌ ఆటగాళ్లు లారీ ఈవాన్స్‌ (60 బంతుల్లో 118 నాటౌట్‌; 12 ఫోర్లు, 6 సిక్సర్లు), సామ్‌ కర్రన్‌ (29 బంతుల్లో 66; ఫోర్‌, 7 సిక్సర్లు, 2/36) రెచ్చిపోయారు. ఫలితంగా వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లు ఘన విజయం సాధించాయి. 

బట్లర్‌ వీరవిహారం..
లాంకాషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వార్సెస్టర్‌షైర్‌ ఆడమ్‌ హోస్‌ (29 బంతుల్లో 42), మిచెల్‌ సాంట్నర్‌ (33 బంతుల్లో 57) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు సాధించింది. లాంకాషైర్‌ బౌలర్లలో డారిల్‌ మిచెల్‌ 3, కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ 2, లూక్‌ వుడ్‌, టామ్‌ హార్ట్‌లీ, వెల్స్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

ఛేదనలో జోస్‌ బట్లర్‌, స్టీవ్‌ క్రాఫ్ట్‌ (40), డారిల్‌ మిచెల్‌ (33 నాటౌట్‌), లివింగ్‌స్టోన్‌ (23) రాణించడంతో లాంకాషైర్‌ 6 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్సెస్టర్‌షైర్‌ బౌలర్లలో పెన్నింగ్టన్‌, పాట్రిక్‌ బ్రౌన్‌ తలో 2 వికెట్లు, ఆడమ్‌ ఫించ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

శతక్కొట్టిన ఈవాన్స్‌.. శివాలెత్తిన సామ్‌ కర్రన్‌
గ్లామోర్గన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సర్రే.. లారీ ఈవాన్స్‌, సామ్‌ కర్రన్‌ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన గ్లామోర్గన్‌.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేసి 65 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సర్రే బౌలర్లలో కర్రన్‌, అట్కిన్సన్‌, క్రిస్‌ జోర్డన్‌ తలో 2 వికెట్లు, సీన్‌ అబాట్‌,సునీల్‌ నరైన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. 

నిన్న జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో ఎసెక్స్‌పై కెంట్‌ 4 వికెట్ల తేడాతో.. వార్విక్‌షైర్‌పై డెర్బీషైర్‌ 6 వికెట్ల తేడాతో.. సోమర్‌సెట్‌పై హ్యాంప్‌షైర్‌ 5 పరుగుల తేడాతో విజయం సాధించాయి.

చదవండి: WTC Final: ట్రెవిస్‌ హెడ్‌ చరిత్ర.. సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా

మరిన్ని వార్తలు