స్వియాటెక్‌కు సబలెంకా షాక్‌

8 Nov, 2022 06:15 IST|Sakshi

టెక్సాస్‌ (అమెరికా): ఈ ఏడాదిని మరో టైటిల్‌తో ముగించాలని ఆశించిన ప్రపంచ నంబర్‌వన్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌)కు నిరాశ ఎదురైంది. మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్‌ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో టాప్‌ సీడ్‌ స్వియాటెక్‌ పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. బెలారస్‌ ప్లేయర్, ప్రపంచ ఏడో ర్యాంకర్‌ సబలెంకా 6–2, 2–6, 6–1తో స్వియాటెక్‌ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది.

లీగ్‌ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన స్వియాటెక్‌ సెమీస్‌లో మాత్రం సబలెంకా ధాటికి తడబడింది. ఈ ఏడాది స్వియాటెక్‌ ఫ్రెంచ్‌ ఓపెన్, యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తోపాటు మరో ఆరు టోర్నీలలో విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో ఆమె 67 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో సెమీఫైనల్లో కరోలినా గార్సియా (ఫ్రాన్స్‌) 6–3, 6–2తో మరియా సాకరి (గ్రీస్‌)పై గెలిచి ఫైనల్లో సబలెంకాతో టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. సాకరి కూడా లీగ్‌ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి కీలకమైన సెమీఫైనల్లో ఓడిపోవడం గమనార్హం. 

మరిన్ని వార్తలు