IND Vs AUS: ఆసీస్‌తో తొలి టెస్టు.. నాగ్‌పూర్‌ చేరుకున్న టీమిండియా

3 Feb, 2023 09:15 IST|Sakshi

నాగ్‌పూర్‌: కివీస్‌తో సిరీస్‌ తర్వాత టీమిండియా సంప్రదాయ క్రికెట్‌కు సమాయత్తమవుతోంది. పటిష్టమైన ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై నాలుగు టెస్టుల బోర్డర్‌-గావస్కర్‌ టెస్టు సిరీస్‌ ఆడనుంది. ఫిబ్రవరి 9 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు నాగ్‌పుర్ వేదిక కానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్స్‌ ఫైనల్స్‌లో టీమిండియా అవకాశాలు సన్నగిల్లకుండా ఉండాలంటే ఈ సిరీస్ తప్పకుండా గెలవాలి.

ఈ టెస్టు సిరీస్‌ టీమిండియాకు చాలా కీలకం. ఇప్పటికే డబ్ల్యూటీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంది. ఆసీస్‌తో సిరీస్‌ను టీమిండియా 3-1తో గెలిస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే చాన్స్‌ ఉంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 10 టెస్టుల్లో గెలుపు, ఒక ఓటమి, నాలుగు డ్రాలతో కలిపి 75.56 పర్సంటైల్‌ పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. ఐదు టెస్టుల్లో గెలుపు, నాలుగింటిలో ఓటమి, ఒక డ్రాతో కలిపి 58.93 పర్సంటైల్‌ పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది.

దీంతో ఈ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా భారత జట్టు తొలి టెస్టు కోసం నాగ్‌పుర్ చేరుకుంది. మహమ్మద్ సిరాజ్ సహా పలువురు ఆటగాళ్లు నాగ్‌పుర్ చేరుకున్నారు. రవీంద్ర జడేజాతో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్ నాగ్‌పుర్ విమానాశ్రయంలో కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ టెస్టుకు రవీంద్ర జడేజా పునరాగమనం చేసే అవకాశం కనిపిస్తోంది. చాలా కాలం గ్యాప్ తర్వాత అతడు జట్టులోకి రానున్నాడు. ఇటీవల రంజీ సీజన్‌లోనూ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్లతో రాణించాడు.

విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్‌తో పాటు జడేజా చేరిక కూడా భారత జట్టుకు మరింత బలం చేకూరనుంది. ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ లాంటి పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా.. భారత్‌తో టెస్టు మ్యాచ్‌ల్లో రాణించలేకపోయింది. గత రెండు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను చేజార్చుకుంది. దీంతో ఈ సిరీస్‌తో పుంజుకోవాలని చూస్తున్నారు.

ఆస్ట్రేలియా భారత పర్యటన షెడ్యూల్‌: ఫిబ్రవరి 09- మార్చి 22.. టెస్టు సిరీస్‌తో ప్రారంభం- వన్డే సిరీస్‌తో ముగింపు
నాలుగు టెస్టుల సిరీస్‌
► ఫిబ్రవరి 9- 13: నాగ్‌పూర్‌
► ఫిబ్రవరి 17- 21: ఢిల్లీ
► మార్చి 1-5: ధర్మశాల
► మార్చి 9- 13: అహ్మదాబాద్‌

మూడు వన్డేల సిరీస్‌
► మార్చి 17- ముంబై
► మార్చి 19- వైజాగ్‌
► మార్చి 22- చెన్నై 

చదవండి: ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు.. పఠాన్‌ను ఉతికారేసిన విండీస్‌ స్టార్‌

మరిన్ని వార్తలు