మాస్టర్‌కు సెల్యూట్‌ అంటూ కమల్‌ హాసన్‌.. గురువు అంటూ అనిల్‌ కపూర్‌ నివాళి

3 Feb, 2023 08:59 IST|Sakshi

లోకనాయకుడు కమల్‌ హాసన్‌కు తెలుగులో స్టార్‌డమ్‌ను తీసుకొచ్చిన వ్యక్తి.. కళాతపస్వి కే. విశ్వనాథ్‌. వాళ్లిద్దరి మధ్య అనుబంధం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అందుకే ఆయన మృతిపై కమల్‌ ఎమోషనల్‌ అయ్యారు. 

కళాతపస్వి కె విశ్వనాథ్ గారు జీవిత పరమార్థాన్ని, కళ యొక్క అమరత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు. అందువల్లే జీవితకాలం దాటినా.. ఆయన కళకు గుర్తింపు ఉంటూనే ఉంటుంది. ఆయన కళ అజరామరం. అమితమైన అభిమాని కమల్‌ హాసన్‌ అంటూ ట్వీట్‌ చేశారాయన. 

కిందటి ఏడాది హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంలో తన మాస్టర్‌ విశ్వనాథ్‌ను ప్రత్యేకంగా వెళ్లి కలిశారు కమల్‌. ఆ సమయంలో పాత విషయాలను గుర్తు చేసుకున్నట్లు కమల్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. సాగర సంగమంతో మొదలైన వీళ్ల కాంబోలో.. స్వాతి ముత్యం, శుభ సంకల్పం లాంటి కల్ట్‌ క్లాసిక్‌లు వచ్చాయి. శుభ సంకల్పంతో పాటు కురుతిపునాల్‌(ద్రోహి), ఉత్తమ విలన్‌ చిత్రాల్లో కలిసి నటించారు.   

గతంలో ఓ ఇంటర్వ్యూలో కమల్‌ హాసన్‌ గురించి స్పందిస్తూ.. కమల్‌ హాసన్‌కు సినిమా గురించి అపారమైన నాలెడ్జ్ ఉంది. నటనలో, దర్శకత్వంలో అతనికి తెలియనిది అంటూ లేదు. అంత నాలెజ్డ్ ఉండడం తప్పు సినిమా రంగంలో  అంటూ విశ్వనాథ్ చమత్కరించారు. అంతేకాకుండా..కమల్ హాసన్‌తో సినిమా తీస్తున్నప్పుడు ఎలాంటి నటన రాబట్టాలనే విషయాన్ని ఆలోచిస్తానన్నారాయన.

ఇక.. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనిల్‌ కపూర్‌.. కే విశ్వనాథ్‌ మృతిపై ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. విశ్వనాథ్‌గారూ తనకెంతో నేర్పించారని, ఈశ్వర్‌ షూటింగ్‌ సందర్భంలో.. ఒక దేవాలయంలో ఉన్న అనుభూతి చెందానని ట్వీట్‌ చేశారు అనిల్‌ కపూర్‌. కమల్‌ హాసన్‌ ‘స్వాతి ముత్యం’ చిత్రాన్ని బాలీవుడ్‌లో ఈశ్వర్‌ పేరుతో రీమేక్‌ చేశారు విశ్వనాథ్‌. అందులో అనిల్‌ కపూర్‌, విజయశాంతి లీడ్‌ రోల్‌లో నటించారు. ఉత్తమ కథగా ఈ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్‌ కూడా అవార్డు దక్కింది.

మరిన్ని వార్తలు