క్రికెట్‌లో ఔట్లు ఎన్ని విధంబులు అనిన...???

7 Nov, 2023 11:00 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ టైమ్‌ ఔట్‌గా ప్రకటించబడిన నేపథ్యంలో ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. అసలు క్రికెట్‌లో ఓ బ్యాటర్‌ ఎన్ని రకాలుగా ఔట్‌గా ప్రకటించబడతారని అభిమానులు గూగుల్‌ చేయడం ప్రారంభించారు. దీనికి సమాధానం​ పది. 

ఇందులో క్యాచ్‌ ఔట్‌, బౌల్డ్‌, ఎల్బీడబ్ల్యూ, రనౌట్‌,స్టంపౌట్‌ అతి సాధారణంగా ప్రకటించబడే ఔట్‌లు కాగా.. హిట్‌ వికెట్‌ (బ్యాటర్‌ వికెట్లను తగలడం), హిట్‌ ట్వైస్‌ (బ్యాటర్‌ రెండుసార్లు బంతిని కొట్టడం), టైమ్డ్‌ ఔట్‌ (నిర్దేశిత సమయంలోపు బ్యాటింగ్‌కు దిగకపోవడం), హ్యాండిల్డ్‌ బాల్‌ (బంతిని పట్టుకోవడం లేదా ఆపడం), అబ్స్ట్రక్టెడ్‌ ఫీల్డ్‌ (ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్‌కు అడ్డుతగలడం) వంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. 

వీటిలో బ్యాటర్లు దాదాపు అన్ని విధాల్లో ఒకటి అంత కంటే ఎక్కువసార్లు ఔట్‌ కాగా.. నిన్నటి మ్యాచ్‌లో (శ్రీలంక వర్సెస్‌ బంగ్లాదేశ్‌) ఓ బ్యాటర్‌ (ఏంజెలో మాథ్యూస్‌) తొలిసారి టైమ్డ్‌ ఔట్‌గా ప్రకటించబడ్డాడు. మాథ్యూస్‌ను టైమ్‌ ఔట్‌గా ప్రకటించే విషయంలో బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ క్రీడాస్పూర్తికి విరుద్దంగా వ్యవహరించాడని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఏదిఏమైనా రూల్‌ కాబట్టి, అంతిమంగా ఫలితం అతనికి అనుకూలంగానే వచ్చింది.

ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 3 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ విజయం సాధించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఆ జట్టు ఇదివరకే ప్రపంచకప్‌ నుంచి ఎలిమినేట్‌ (సెమీస్‌కు అర్హత సాధించలేదు) అయ్యింది. తాజా ఓటమితో శ్రీలంక కూడా బంగ్లాదేశ్‌తో పాటు ఎలిమినేషన్‌కు గురైంది. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌, శ్రీలంకలతో పాటు ఇంగ్లండ్‌ కూడా ఇదివరకే ఎలిమినేట్‌ కాగా.. భారత్‌, సౌతాఫ్రికా జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. సెమీస్‌ రేసులో మూడు, నాలుగు స్థానాల కోసం పోటీ నడుస్తుంది.

చదవండి: మాథ్యూస్‌ టైమ్‌ ఔట్‌.. అలా జరిగినందుకు బాధ లేదు.. రూల్స్‌లో ఉన్నదే చేశా: షకీబ్‌

మరిన్ని వార్తలు