చికిత ‘పసిడి’ గురి...

6 Nov, 2023 02:19 IST|Sakshi

రష్మిక ఖాతాలో మూడో పతకం  

పనాజీ (గోవా): జాతీయ క్రీడల్లో తెలంగాణకు మూడో స్వర్ణ పతకం లభించింది. ఆదివారం జరిగిన మహిళల ఆర్చరీ కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో తణిపర్తి చికిత పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాపూర్‌ గ్రామానికి చెందిన చికిత ఫైనల్లో 143–142తో ప్రియా గుర్జర్‌ (రాజస్తాన్‌)పై గెలిచింది. మరోవైపు మహిళల టెన్నిస్‌ ఈవెంట్‌లో తెలంగాణ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక మూడో పతకాన్ని దక్కించుకుంది.

మహిళల టీమ్‌ విభాగంలో కాంస్యం నెగ్గిన రష్మిక... డబుల్స్‌ విభాగంలో శ్రావ్య శివానితో రజతం సాధించింది. ఆదివారం జరిగిన సింగిల్స్‌ విభాగంలో రష్మిక రజత పతకం సొంతం చేసుకుంది. వైదేహి (గుజరాత్‌)తో జరిగిన టైటిల్‌ పోరులో రష్మిక 5–7, 6–7 (3/7)తో పోరాడి ఓడిపోయింది. ప్రస్తుతం తెలంగాణ 3 స్వర్ణాలు, 8 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి 19 పతకాలతో 22వ స్థానంలో ఉంది.  

మరిన్ని వార్తలు