IND Vs ENG 3rd Test: పిచ్‌ బాగానే ఉంది.. మేమే పొరపాట్లు చేశాం: కోహ్లి

28 Aug, 2021 19:36 IST|Sakshi

హెడింగ్లే: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో ముగిసిన మూడో టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఓటమిపాలై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 215/2 వద్ద నాలుగో రోజు ఆటను ఆరంభించిన భారత్‌.. ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆతిధ్య జట్టు భారత ఆధిక్యాన్ని 1-1కి తగ్గించి సిరీస్‌ను సమం చేసింది. కాగా, మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్‌ విరాట​ కోహ్లి మాట్లాడుతూ.. 

ఇంగ్లండ్‌ బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరిస్తున్నప్పటికీ వారు క్రమశిక్షణ కలిగి బౌలింగ్‌ చేశారని కొనియాడాడు. నాలుగో రోజు ఆటలో మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశం ఉ‍న్నప్పటికీ, తాము సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యామని, ఫలితంగా తగిన మూల్యం చెల్లించుకున్నామని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌కు భారీ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించడం మాపై ఒత్తిడి పెంచిందని, నాలుగో రోజు తమ ఇన్నింగ్స్‌ కుప్పకూలడానికి ఇదే ప్రధాన కారణమని అన్నాడు. టాపార్డర్‌ నిలకడలేమి టీమిండియా కొంపముంచిందని, లోయర్‌ మిడిలార్డర్‌ రాణించాలంటే టపార్డర్‌ గట్టి పునాది వేయాలని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌ కోల్పోయినందుకు ఎవరినీ నిందించదలచుకోలేదని, అన్ని విభాగాల్లో ఆధిపత్యం చలాయించి రూట్‌ సేన గెలుపునకు నిజమైన అర్హులని తెలిపాడు. 

ఇక అదనపు స్పిన్నర్‌ ఆడించాలన్నది పిచ్‌పై ఆధారపడి ఉంటుందని, ఈ మ్యాచ్‌ వరకు నలుగురు పేసర్లతో బరిలోకి దిగడం కరెక్టేనని పేర్కొన్నాడు. అశ్విన్‌ను తుది జట్టులో ఆడించే అంశంపై నాలుగో టెస్ట్‌కు ముందు పునరాలోచించి నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. మొత్తంగా పిచ్‌ సహకరించినా పేలవమైన బ్యాటింగ్‌, బౌలింగ్‌ కారణంగా మ్యాచ్‌ను చేజార్చుకున్నామని, తదుపరి మ్యాచ్‌లో తమ పొరపాట్లను బేరీజు వేసుకుని వాటిని అధిగమిస్తామని విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్‌ కెన్నింగ్స్టన్‌ ఓవల్‌ వేదికగా సెప్టెంబర్‌ 2 నుంచి ప్రారంభంకానుంది.
చదవండి: చరిత్ర సృష్టించిన ఆండర్సన్‌.. ఆ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌గా రికార్డు
 

>
మరిన్ని వార్తలు