బయో బబుల్‌ను వీడిన ముగ్గురు క్రికెటర్లపై వేటు వేసిన లంక బోర్డు

28 Jun, 2021 21:21 IST|Sakshi

డర్హమ్‌: ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ముగ్గురు శ్రీలంక క్రికెటర్లపై ఆ దేశ క్రికెట్‌ బోర్డు వేటు వేసింది. బయో బబుల్‌ నిబంధనలు ఉల్లంఘించి, రోడ్లపై సిగరెట్లు కాలుస్తూ కెమెరా కంటికి చిక్కిన లంక స్టార్‌ ఆటగాళ్లు కుశాల్ మెండిస్, నిరోషన్ డిక్వెల్లా, దనుష్క గుణతిలకలను తక్షణమే స్వదేశానికి పయనమవ్వాలని లంక బోర్డు ఆదేశించింది. లంక తుది జట్టులో రెగ్యులర్‌ సభ్యులైన ఈ ముగ్గురు ఆటగాళ్లు.. ఇంగ్లండ్‌తో చివరి టీ20 అనంతరం బయో బబుల్ నిబంధనల్ని అతిక్రమించి హోటల్‌ పరిధి దాటి వెలుపలికి వచ్చారు. అంతటితో ఆటగకుండా రోడ్లపై సిగరెట్లు కాలుస్తూ.. తమ దేశ అభిమాని కంట బడ్డారు.

వీరి నిర్వాకాన్ని ఆ అభిమాని కెమెరాలో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో లంక క్రికెట్‌ బోర్డు అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ అంశాన్ని శ్రీలంక క్రికెట్ చీఫ్ షమ్మి సిల్వా సీరియస్‌గా పరిగణించి, విచారణకు ఆదేశించారు. సమగ్ర దర్యాప్తు అనంతరం ఈ ముగ్గరు క్రికెటర్లు బయో బబుల్‌ నిబంధనలను ఉల్లఘించారని రుజువు కావడంతో వారిపై తక్షణ వేటు వేశారు. ఇదిలా ఉంటే, మూడు టీ20లు, మూడు వన్డేల కోసం లంక జట్టు ఇంగ్లండ్​లో పర్యటిస్తోంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను ఆతిధ్య జట్టు 3-0తో క్లీన్‌స్వీప్‌ చేయగా, జూన్‌ 29 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ప్రారంభంకానుంది.
చదవండి: కోహ్లీని తప్పిస్తే టీమిండియా ఐసీసీ టోఫ్రీ గెలుస్తుందా..?

మరిన్ని వార్తలు