Paralympic Love Proposal: అంధ అథ్లెట్‌కు ట్రాక్‌పైనే లవ్‌ ప్ర‌పోజ్ చేసిన గైడ్‌

4 Sep, 2021 11:41 IST|Sakshi

టోక్యో: పారాలింపిక్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన 200 మీట‌ర్ల పరుగు పందెంలో రన్నింగ్‌ ట్రాక్‌పై ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ అంధ అథ్లెట్‌కు ఆమె గైడ్‌ రన్నింగ్‌ ట్రాక్‌పైనే ప్రమోజ్‌ చేసి ఆమెతో సహా అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. వివరాల్లోకి వెళితే.. కేప్ వ‌ర్డే దేశానికి చెందిన స్ప్రింట‌ర్ క్యూలా నిద్రేయి పెరీరా సెమెడో.. సెమీ ఫైన‌ల్లోనే ఇంటిదారి పట్టింది. అయితే ఆమె ఏమాత్రం నిరాశపడలేదు. ఎందుకంటే.. ఆమెకు మెడ‌ల్ కంటే గొప్ప బహుమతి లభించింది. దీంతో ఆమె స్వర్ణం గెలిచినంతగా ఉబ్బితబ్బిబిపోయింది. 

పరుగు పందాన్ని నాలుగో స్థానంతో ముగించిన అనంతరం ఆమె గైడ్‌ మాన్యువల్ ఆంటోనియో వాజ్ డా వేగా ట్రాక్‌పైనే పెరీరాకు లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. మోకాళ్ల మీద కూర్చుని.. 'నన్ను పెళ్లి చేసుకుంటావా' అని అడిగాడు. అందుకు ఒక్కసారిగా అవాక్కయిన పెరీరా.. అనంతరం ఓకే చెప్పడంతో సహచర అథ్లెట్లతో సహా మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరూ చప్పట్లతో లవ్‌ బర్డ్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్రాక్‌పై లవ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది.

ఈ సర్‌ప్రైజ్‌ లవ్‌ ట్రాక్‌ను పారాలింపిక్స్‌ నిర్వాహకులు అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేశారు. 'జీవితంలో ఇద్దరూ కలిసి పరుగులు ప్రారంభించండి' అంటూ ట్వీటారు. కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో కూడా ఇలాంటి లవ్‌ ప్రపోజల్‌ సీన్‌ ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేసింది. అర్జెంటీనా ఫెన్సర్ మరియా బెలెన్ పెరెజ్ మారిస్‌కు ఆమె కోచ్‌ లూకాస్ సౌసెడో లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. 2010 పారిస్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ సందర్భంగా కూడా సౌసెడో ఇలానే ప్రేమను వ్యక్తపరచడం విశేషం. 
చదవండి: కేబీసీలో.. కేటీఆర్‌? విషయం ఏమిటంటే?

మరిన్ని వార్తలు