Trent Boult: న్యూజిలాండ్‌ క్రికెట్‌కు భారీ షాక్‌.. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తప్పుకున్న స్టార్‌ బౌలర్‌

10 Aug, 2022 11:07 IST|Sakshi

న్యూజిలాండ్‌ క్రికెట్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ ఆ దేశ సెంట్రల్‌ కాంట్రక్ట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు (ఎన్‌జెడ్‌సీ) బుధవారం ధృవీకరించింది. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు అలాగే ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్‌లకు అందుబాటులో ఉండేందుకు బౌల్ట్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌జెడ్‌సీ వెల్లడించింది. 

బౌల్ట్‌ నిర్ణయంతో జట్టు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కోల్పోయినప్పటికీ, జాతీయ జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకుంటామని (అతని సమ్మతం మేరకు) ఎన్‌జెడ్‌సీ పేర్కొంది. బౌల్ట్‌ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకునే అవకాశం ఉందని తెలిపింది. తమ దేశ స్టార్‌ బౌలర్ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కోల్పోవడం బాధాకరమని, అతని భవిష్యత్తు మరింత బాగుండాలని విష్‌ చేసిం‍ది. ఇప్పటివరకు అతను జట్టుకు చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలిపింది.  

కాగా, న్యూజిలాండ్‌ క్రికెట్‌ నిబంధనల ప్రకారం సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లేదా డొమెస్టిక్‌ కాం‍ట్రాక్ట్‌ ఉన్న ఆటగాళ్లను మాత్రమే జాతీయ జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకుంటారు. బౌల్ట్‌ తాజాగా నిర్ణయంతో అతను అనధికారికంగా న్యూజిలాండ్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనట్లే అవుతుంది. 33 ఏళ్ల బౌల్ట్‌ 2011లో అంతర్జాతీయ క్రికెట్‌ అరంగేట్రం చేసినప్పటి నుంచి న్యూజిలాండ్‌ క్రికెట్‌కు భారీ సహకారాన్నందించాడు. అతని జట్టులో ఉండగా కివీస్‌ అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ జట్టుగా కొనసాగింది. కివీస్‌ తరఫున 78 టెస్ట్‌లు, 93 వన్డేలు, 44 టీ20 ఆడిన బౌల్ట్‌.. మొత్తం 548 వికెట్లు (టెస్ట్‌ల్లో 317, వన్డేల్లో 169, టీ20ల్లో 62) పడగొట్టాడు. 
చదవండి: మహిళా క్రికెట్‌ జట్టుపై గంగూలీ అభ్యంతరకర ట్వీట్‌.. ఆటాడుకుంటున్న నెటిజన్లు

మరిన్ని వార్తలు