IND Vs WI 1st ODI: రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు..!

23 Jul, 2022 07:37 IST|Sakshi

రెండేళ్ల తర్వాత వన్డే జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన భారత యువ ఆటగాడు శుభ్‌మాన్‌ గిల్‌ అదరగొట్టాడు. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో గిల్‌ అర్దసెంచరీతో మెరిశాడు. ధావన్‌తో కలిసి తొలి వికెట్‌కు 119 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని టీమిండియాకు అందించాడు. ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ 53 బంతుల్లో 6 ఫోర్లు,2 సిక్స్‌ల సాయంతో 64 పరుగులు సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో మంచి ఊపు మీద కనిపించిన గిల్‌ నిర్లక్ష్యంగా పరుగెత్తి రనౌట్‌ రూపంలో ఔటయ్యాడు. ఇక గిల్‌ వన్డేల్లో చివరగా 2020లో ఆస్ట్రేలియాపై ఆడాడు.

ప్రస్తుతం జరుగుతోన్న విండీస్‌ సిరీస్‌కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ దూరం కావడంతో ఓపెరన్‌గా గిల్‌కు జట్టులో చోటు దక్కింది. అయితే గిల్‌ దొరికిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు.  ఈ క్రమంలో గిల్‌పై ట్విటర్‌లో అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "అద్భుతంగా ఆడావు గిల్‌.. రైజింగ్‌ ఇండియన్‌ సూపర్‌ స్టార్‌ అంటూ" అంటూ ట్విటర్‌లో పోస్టులు చేస్తున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. అఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన తొలిపోరులో విండీస్‌పై భారత్‌ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. 309 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరీబియన్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. విండీస్‌ జట్టులో  కైలే మేయర్స్‌ 75 పరుగులు, బ్రాండన్‌ కింగ్‌ 54 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, చహల్‌ ముగ్గురూ కూడా రెండేసి వికెట్లు తీశారు.

ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌  50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ 97 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. శుబ్‌మన్‌ గిల్‌ (64) శ్రేయస్‌ అయ్యర్‌(54) పరుగులతో రాణించారు. వెస్టిండీస్‌తో అల్జారీ జోసెఫ్, గుడకేశ్‌ మోతీ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా ఆదివారం(జూలై24) జరగనుంది.
చదవండి: Shikar Dhawan: సెంచరీ మిస్‌ అయినా రికార్డుల మోత

మరిన్ని వార్తలు